నర్సాపూర్, ఆగస్టు 7: కేసీఆర్ ప్రభుత్వం హల్దీ వాగుపై 8 చెక్‌డ్యామ్‌లు, మంజీరాపై 8 చెక్‌డ్యామ్‌లు నిర్మించి జిల్లాకు కాళేశ్వరం జలాలు తెచ్చిందని, కాంగ్రెస్ పాలనలో జిల్లాకు ఒరిగిందేమీ లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యేలు సునీతాలక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డితో హరీశ్‌రావు విలేకరులతో మాట్లాడారు. సీఎం రేవంత్ కాళేశ్వరం ప్రాజెక్టు దండగా అంటున్నాడని.. హల్దీ, మంజీరా పరీవాహక ప్రాంత రైతులను అడిగితే కాళేశ్వరంతో ఎంత మేలు జరిగిందో చెబుతారని ఎద్దేవా చేశారు.
కాళేశ్వరం నీళ్లతో ఈ ప్రాంతంలో ఎండాకాలంలో చెక్‌డ్యామ్‌లు మత్తళ్లు దుంకాయని, కాళేశ్వరం నీళ్లు నర్సాపూర్ నియోజకవర్గంలో పారినాయా లేదా…పంటలు పండినయా లేదా…నేరుగా రైతులను అడుగుదామని సీఎంకు హరీశ్‌రావు సవాలు విసిరారు. కేసీఆర్ హయాంలో మల్లన్న సాగర్ నుంచి, కొండపోచమ్మ సాగర్ నుంచి నీళ్లు వదిలితే కాళేశ్వరం నీరు నర్సాపూర్ నియోజకవర్గంలోని రైతులకు అంది పంటలు పండినయా లేదా అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి మేడిగడ్డను పడావు పెట్టాడని, గోదావరి నీళ్లను బనకచర్లకు జారగొట్టాడని మండిపడ్డారు.
గురుదక్షణ చెల్లించడానికి బనకచర్లకు గోదావరి నీళ్లను జారగొడుతున్నాడని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో మెదక్‌లోని దుబ్బాక, నర్సాపూర్, మెదక్, రామాయంపేట్, చిన్నశంకరంపేట తదితర మండలాల్లో నీళ్లంది పంటలు పండాయని గుర్తుచేశారు. కాళేశ్వరం నీటితో ఒక్క ఎకరా పండలేదని రేవంత్‌రెడ్డి అనడం అవివేకమన్నారు. మేడిగడ్డ బ్యారేజ్‌తో నిమిత్తం లేకుండా కన్నెపల్లి మోటర్లను ఆన్‌చేస్తే ఇప్పడు కూడా మెదక్ జిల్లాకు గోదావరి నీరు తెచ్చుకోవచ్చని అన్నారు.
నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, గ్రౌండ్ వాటర్ తగ్గిపోయి రైతులు ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. ఇప్పుడు కేసీఆర్ అధికారంలో ఉండుంటే కన్నెపల్లి మోటర్లు ఆన్‌చేసి హల్దీ, మంజీరా నదిలో నీళ్లు పారించేవాడని అన్నారు. 9 నెలలుగా బిల్లులు రాక మధ్యాహ్న భోజన కార్మికులు హైదరాబాద్‌లో ధర్నా చేస్తే, వారిని అక్రమంగా అరెస్ట్ చేయించారని మండిపడ్డారు. మహిళలను కోటేశ్వరులను చేస్తానని అప్పుల పాలు చేశాడని సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 21 నెలల పాలనలో రేవంత్ సర్కారు రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులను కష్టాల పాలు చేసిందన్నారు. ప్రజా పాలన అని గొప్పలు చెప్పి అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు పెట్టడం తప్ప ఏమీ చేయలేదని మండిపడ్డారు.
తులం బంగారం ఏమైంది..
24గంటల ఉచిత విద్యుత్, కల్యాణలక్ష్మి వంటి పథకాలు హామీ ఇవ్వకున్నా బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసినట్లు హరీశ్‌రావు గుర్తుచేశారు. రూ.200 పింఛన్ రూ.1000 చేశామని, సీలింగ్ ఎత్తేసి నాలుగు కిలోల బియ్యాన్ని ఆరు కిలోలకు పెంచామని, చెరువులను పునరుద్ధ్దరించామని, పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి లక్షలాది ఎకరాలకు నీరు అందించామని, అనేక చెక్‌డ్యామ్‌లు నిర్మించామని, ఇవన్ని కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపించినట్లు హరీశ్‌రావు తెలిపారు.
కల్యాణలక్ష్మి పథకంతో తులం బంగారం ఇస్తామని రేవంత్ సర్కారు ఇవ్వడం లేదన్నారు. ఇంటికి రెండు పింఛన్లు ఇస్తామని, రూ.2 వేల పింఛన్ రూ.4 వేలు చేస్తామని హామీ ఇచ్చి రెండేండ్లు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేదని హరీశ్‌రావు విమర్శించారు. రెండు లక్షల పింఛన్లు తొలిగించిందని ఆరోపించారు. ప్రెస్మీట్లో బీఆర్ఎస్ నాయకులు దేవేందర్‌రెడ్డి, చంద్రాగౌడ్, అశోక్‌గౌడ్, మన్సూర్, వెంకటనర్సింగరావు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.