మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 7: పదేండ్ల కేసీఆర్ పాలనలో రైతు సంతోషంగా ఉన్నారని, నేడు రేవంత్ పాలనలో అన్నదాత అరిగోస పడుతున్నాడని, రాబందుల పాలన నడుస్తోందని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. సంపూర్ణ పంట రుణమాఫీ, రైతుభరోసా, సన్న వడ్లకు బోనస్ తదితర హామీలు విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం మెదక్ కలెక్టరేట్ వద్ద రైతు మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకాగా, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, శశిధర్‌రెడ్డి, నాయకులు, రైతులు హాజరయ్యారు. హరీశ్‌రావుకు అత్యవసర పనులపై ఫోన్ రాగానే మధ్యలోనే సమావేశం నుంచి వెళ్లిపోయారు.
ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. మెదక్ కలెక్టరేట్ ఎదుట ఇంత పెద్దఎత్తున రైతులు ధర్నా చేస్తున్నారంటే ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. 600 రోజుల రేవంత్‌రెడ్డి పాలనలో 600 రైతుల ఆత్మహత్యలు చోటుచేసుకోవడం బాధాకరం అన్నారు. మెదక్ జిల్లాలో అత్యధిక రైతు ఆత్మహత్యలు జరగడం బాధిస్తోందన్నారు. రైతు ఆత్మహత్యలకు కారణం రాష్ట్ర ప్రభుత్వ వైఫ్యలాలే అని ఆరోపించారు. కనీసం రైతులకు యూరియా ఇవ్వని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని మాజీమంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. రేవంత్‌రెడ్డి పాలనను గాలికొదిలేసి కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకునే పరిస్థితుల్లో లేదన్నారు. అనేక హామీలిచ్చి మోసం చేసిందన్నారు. కాంగ్రెస్, బీజేపీలు మిలాఖాత్ అయి చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధ్ది చెప్పాలని ప్రజలకు మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి పిలుపునిచ్చారు. అంతకు ముందు మెదక్ నియోజకవర్గ ఇన్చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్లు మల్లికార్జున్‌గౌడ్, బట్టి జగపతి, మాజీ ఎంపీపీ హరికృష్ణ, రైతు సంఘం మాజీ అధ్యక్షుడు సోములు, దేవేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ మెదక్ పట్టణ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయులు తదితరులు మాట్లాడారు.
ధర్నా అనంతరం కలెక్టరేట్‌కు వెళ్లి కలెక్టరేట్ కార్యాలయ అధికారికి వినతిపత్రం అందజేశారు. రైతు ధర్నాలో జడ్పీ మాజీ చైర్పర్సన్ హేమలతా శేఖర్‌గౌడ్, జడ్పీ ఉపాధ్యక్షురాలు లావణ్యరెడ్డి, ఇఫ్కో మాజీ డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్లు కృష్ణారెడ్డి, గడ్డమీది కృష్ణాగౌడ్, ప్రభురెడ్డి, కిశోర్, శ్రీనివాస్, జయరాజ్, మల్లేశం, వీరేశం, జగదీశ్, సోహేల్, శ్రీనివాస్, చంద్రకళ, విజయలక్ష్మి, సాయిలు, సలాం, గౌష్ ఖురేషి ,బీఆర్ఎస్ నాయకులు జగన్, వీరప్ప, ఫాజిల్, లింగారెడ్డి, అరుణ్, కిరణ్, మోచి కిషన్, అంజాగౌడ్, అందనేయులు, శ్రీనివాస్‌గౌడ్, రబ్బీ, మాయ శ్రీనివాస్, రాధ, స్వామినాయక్, లడ్డూ, రైతులు పాల్గ్గొన్నారు.
రేవంత్‌రెడ్డి నైజం బయట పడింది
-బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మరిచిపోయిందని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి విమర్శించారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఏమయ్యాయని సీఎంను ఆమె ప్రశ్నించారు. కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా ఇస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని బంద్ చేసిందన్నారు. రుణమాఫీ సంపూర్ణంగా చేయలేదన్నారు. సన్న వడ్లకు బోనస్ ఇవ్వకుండా రైతులను మోసం చేసిందన్నారు. రైతుల కష్టాలు ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు.
రేవంత్‌రెడ్డి నైజం బయట పడిందని, ప్రజలు గమనిస్తున్నారని, తగిన గుణపాఠం చెబుతారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ చేస్తున్న పోరాటం ఆరంభం మాత్రమే అని, భవిష్యత్తులో ప్రజలు, రైతుల కోసం మరిన్ని పోరాటాలు చేస్తామన్నారు. కేసీఆర్‌పై అబద్ధ్దపు ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తెలంగాణకు మరోసారి కాబోయే సీఎం కేసీఆర్ అని ఆమె అన్నారు.
రైతును గౌరవంగా నిలబెట్టింది కేసీఆరే
– నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
రైతును గౌరవంగా నిలబెట్ట్డింది కేసీఆరే అని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. రైతుకు మద్దతు ధర, బోనస్ ఇవ్వాలని అడుక్కునే దుస్థితి కాంగ్రెస్ పాలనలో ఏర్పడిందన్నారు. రైతు సమస్యలపై కేటీఆర్ చర్చకు వస్తే సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో దాక్కున్నారన్నారు. రైతులకు బోనస్ ఇస్తామని ఎగ్గొట్టిందని, పంట నష్టానికి ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇవ్వలేదన్నారు. రైతుల కోసం కేసీఆర్ హయాంలో 24 గంటల నిరంతరం కరెంట్ ఇస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. రైతుబీమా కేసీఆర్ ఇస్తే, కాంగ్రెస్ సర్కార్ ప్రీమియం చెల్లించడం లేదన్నారు. ఏక కాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేయడం లేదన్నారు.
ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు
– అందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. రైతుల సంక్షేమాన్ని రేవంత్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. రైతు డిక్లరేషన్‌లో చెప్పిన హామీలను తుంగలో తొక్కిందన్నారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రభుత్వం ఏమిచేస్తున్నదని ప్రశ్నించారు. ఆచరణలో సాధ్యం కానీ హామీలిచ్చి గద్ద్దెనెక్కిన తర్వాత కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలం అయ్యిందన్నారు. కేసీఆర్ బంగారు తెలంగాణ చేస్తే కాంగ్రెస్ నాశనం చేస్తోందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సరైన బుద్ధి చెప్పాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.
హామీలను తుంగలో తొక్కింది
– మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను తుంగలో తొక్కిందని, 2014కు ముందు యూరియా కోసం రైతులు ఎలా పాదరక్షలు వరుసలో పెట్టారో ఇప్పుడు అలాంటి పరిస్ధితి వచ్చిందని మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ హయాంలో 24 గంటల కరెంట్ ఇచ్చారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ ఎప్పుడు వస్తుందో పోతుందో తెలియడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు మెదక్ జిల్లాలో కేవలం లక్షా 50 వేల మెట్రిక్ టన్నుల పంట మాత్రమే పండేదని, ఈ రోజు 4.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖకు అందిస్తున్నామంటే అది కేసీఆర్ దూరపు ఆలోచన అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి రైతు కుటుంబం సంతోషంగా బతికిందన్నారు.
రైతు సంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్
– దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి
అనేక హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకున్న పాపన పోలేదని దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువయ్యాయని, ఎమ్మెల్యేలకు అభివృద్ధి పనులకు ఇవ్వాల్సిన నిధులు సైతం ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు.
కాంగ్రెస్‌కు భంగపాటు తప్పదు
– మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలు తుంగలో తొక్కిందని, రైతుల కష్టాలు ఈ ప్రభుత్వానికి పట్టడం లేదని మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి విమర్శించారు. పంట రుణమాఫీ పూర్తిగా చేయలేదని, బోనస్ ఇవ్వడం లేదన్నారు. రేవంత్ రెడ్డి ఎన్ని జిమ్మికులు చేసినా స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భంగపాటు తప్పదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు బంగాళాఖాతంలో కలుపుతారన్నారు.