సిద్దిపేట అర్బన్, ఆగస్టు 2: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని, మానసిక ఒత్తిడి దూరమవుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. శనివారం సిద్దిపేటలోని విపంచి కళానిలయంలో అస్మిత యోగాసాన సిటీ లీగ్ పోటీల కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కరోనా ప్రపంచ వ్యాప్తంగా ప్రజల జీవితాల్లో అనేక మార్పులు తెచ్చిందన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ఆరోగ్య స్పృహపై ప్రపంచానికి కరోనా పాఠాలు నేర్పిందన్నారు.
అభివృద్ధి అంటే నాలుగు రోడ్లు, భవనాలు, కళాశాలలు నిర్మించడం కాదని, ప్రజల ఆరోగ్య ప్రమాణాలు మారాలన్నారు. ఆరోగ్యమే మహాభా గ్యం అని పెద్దలు అన్నారని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. పిల్లలు ఆటలు ఆడటం మానేసి ఆన్లైన్ గేమ్స్‌కు పరిమితం అవుతున్నారని, ప్రతిరోజు పిల్లలు అవుట్ డోర్ గేమ్స్ ఆడాలని, మితమైన ఆహారం తీసుకుంటేనే అమితమైన ఆరోగ్యం పొందవచ్చన్నారు.
పిల్లలకు చదువుతో పాటు ఆటలు ఆడిపించడం, వ్యాయామం, యోగా చేయ డం వంటివి తప్పకుండా నేర్పించాలన్నారు. సిద్దిపేట పట్టణం జాతీయ స్థాయిలో యోగా పోటీల్లో భాగం కావడం సంతోషంగా ఉంద ని హరీశ్‌రావు అన్నారు. కార్యక్రమంలో సిద్దిపేట మున్సిపల్ చైర్ పర్సన్ కడవేర్గు మంజులా రాజనర్సు, వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు, మాజీ ఏఎంసీ చైర్మన్లు పాల సాయిరామ్, పీఏసీఎస్ చైర్మన్ చింతల శ్రీనివాస్, సిద్దిపేట జిల్లా యోగాసాన స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.