చౌటకూర్, అక్టోబర్ 29: సంగారెడ్డి జిల్లా పులల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టుకు వరద వస్తున్నది. మొంథా తుపాన్ కారణంగా మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పక్షం రోజుల అనంతరం సింగూరు ప్రాజెక్టులోకి మళ్లీ వరద ప్రారంభమైంది. ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షానికి వరద వచ్చి చేరుతున్నది.
బుధవారం సాయంత్రం ఆరు గంటల వరకు ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 11,877 క్యూసెకులుగా నమోదైంది. నీటి పారుదలశాఖ ఇంజినీరింగ్ అధికారులు 14వ క్రస్ట్ గేట్‌ను రెండు మీటర్లు పైకి ఎత్తి 9,649 క్యూసెకుల నీటిని దిగువన ఉన్న మంజీరా జలాశయానికి వదులుతున్నారు. జల విద్యుత్ ఉత్పత్తి గేట్ ద్వారా 2,433 క్యూసెకులు మొత్తం ఔట్ ఫ్లో 12,082 క్యూసెకులుగా నమోదైంది.