Singur Dam | పుల్కల్, సెప్టెంబర్ 24: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో సంగారెడ్డి జిల్లాలోని బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టు నీటితో నిండి కళకళలాడుతోంది. కొన్ని రోజులుగా కురిసిన వర్షాలు కాస్త తగ్గు ముఖం పట్టడంతో ప్రాజెక్టులోకి వచ్చే వరద సైతం తగ్గింది. ఉన్నట్టుండి సోమవారం వరద తీవ్రత పెరగడంతో అప్రమత్తమైన నీటిపారుదలశాఖ అధికారులు 11వ గేటు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల ప్రాజెక్టులోకి వరద పెరిగిందని ఏఈ మహిపాల్‌రెడ్డి వెల్లడించారు.
ప్రాజెక్టులోకి వరద అధికంగా వస్తున్న కారణంగా అధికారులు అప్రమత్తమై ఎప్పటికప్పుడు నీటి హెచ్చుతగ్గులను గమనిస్తూ ప్రాజెక్టు క్రస్ట్ గేట్ ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు.అందులో భాగంగానే మంగళవారం కూడా ప్రాజెక్టులోకి వరద కొనసాగుతుండటంతో అధికారులు 11వ గేటు 1.50 మీటర్ల ఎత్తు లేపి 4919 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతుండగా, 2823 క్యూసెక్కుల నీటిని విద్యుత్ ఉత్పత్తి కోసం వదులుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు ఉండగా, ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ 29.857 టీఎంసీలుగా ఉన్నది. ప్రాజెక్టులోకి 9967 క్యూసెక్కుల నీ రు వరద రూపంలో వస్తుండగా,అవుట్‌ఫ్లో 8243 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.