Drinking Water | వెల్దుర్తి, జూన్ 2 : గత నాలుగైదు రోజుల నుండి గ్రామంలో తాగునీరు రావడం లేదని ఆగ్రహించిన గ్రామస్తులు రాష్ట్ర అవతరణ దినోత్సవం సోమవారం నాడు గ్రామపంచాయతీ వద్ద జెండా ఆవిష్కరణను అడ్డుకొని గ్రామపంచాయతీ ముందు ఖాళీ బిందెలతో నిరసన తెలిపిన ఘటన వెల్దుర్తి మండల పరిధిలోని హస్తాల్ పూర్ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.
గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం హస్తాల్ పూర్ గ్రామంలోని తాగునీటిని సరఫరా చేసే బోరు మోటార్ చెడిపోవడం, గ్రామానికి మిషన్ భగీరథ నీరు సరఫరా కాకపోవడంతో గత నాలుగైదు రోజుల నుండి గ్రామంలో తాగునీరు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మండిపడ్డారు. దీంతో గ్రామ శివారులోని వ్యవసాయ బోరు మోటార్ల నుండి నీటిని తెచ్చుకొని నానా అవస్థలు పడుతున్నామన్నారు.
ఈ విషయమై పంచాయతీ అధికారులను అడగగా పంచాయతీలో నిధులు లేవని, గతంలోనే రెండుసార్లు మాజీ సర్పంచ్ తన సొంతంగా పైసలు ఖర్చుపెట్టి బోరు మోటార్ మరమ్మత్తు చేయించినా ఇప్పటికీ నిధులు రాలేదన్నారు. దీంతో బోరు మోటార్ మరమ్మత్తులు చేసే పరిస్థితి లేకపోవడంతో ఆగ్రహించిన గ్రామస్తులు, మహిళలు రాష్ట్ర అవతరణ దినోత్సవం సోమవారం ఉదయం 8:30 గంటల నుండి పంచాయతీ కార్యాలయం ముందు ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు.
సుమారు రెండు గంటల పాటు నిరసన చేపట్టిన అనంతరం, పలువురు కాంగ్రెస్ నాయకులు గ్రామానికి చేరుకొని బోరు మోటార్ మరమ్మత్తులు చేయిస్తామని గ్రామస్తులను సముదాయించే ప్రయత్నం చేశారు. ఎన్నో రోజుల నుండి అవస్థలు పడుతున్నా తాము జెండా ఆవిష్కరణ అడ్డుకుంటే తప్ప గ్రామానికి ఎవరూ రాలేదని తాగునీటి సమస్య పరిష్కారం అయ్యేంతవరకు నిరసనను విరమించేది లేదని తెలిపారు. సాయంత్రం వరకు బోరు మోటార్ ఏర్పాటు చేసి తాగునీటి సమస్యను తీరుస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు నిరసనను విరమించారు. నిరసన విరమించడంతో పంచాయతీ కార్యదర్శి శివశంకర్ జాతీయ జెండాను ఎగరవేశారు.
Medak | ఉద్యోగ, ఉపాధ్యాయుల హామీలను ప్రభుత్వం నెరవేర్చాలి: టీజీసీపీఎస్ ఈయూ నేత నర్సింహులు
Textbooks | పాపన్నపేట మండలంలో పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసిన ఎంఈవో ప్రతాప్ రెడ్డి