హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): ఇటీవల గుండెపోటు మరణాల సంఖ్య భారీగా పెరుగుతున్నది. వయసుతో సంబంధం లేకుండా నిత్యం ఏదో ఒకచోట ఇవి సంభవిస్తూనే ఉన్నాయి. స్కూల్ విద్యార్థులు, యువకులు సైతం హఠాత్తుగా గుండెపోటుకు గురై చనిపోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఆటలు ఆడుతూ.. పాటలు పాడుతూనే అకస్మాత్తుగా పడిపోతుండటం కలవరపెడుతున్నాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా గుండెపోటు మరణాల్లో 20 శాతం భారత్‌లోనే సంభవిస్తున్నట్టు తాజా నివేదిక వెల్లడించింది. మన దేశం క్రమంగా ‘కార్డియాక్ ఎమర్జెన్సీ’ వైపు పయనించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూనే.. ఈ అంశాన్ని తేలికగా తీసుకోవద్దని హెచ్చరించింది. ఈ మేరకు బీఎం బిర్లా హార్ట్ దవాఖాన ‘బీట్ బై బీట్-2025’ పేరిట అధ్యయనం చేయగా.. తాజాగా ఆ నివేదిక వివరాలను వెల్లడించింది. ఈ రిపోర్టు ప్రకారం.. గుండెపోటు మరణాలు ప్రపంచ ఆరోగ్య సంక్షోభంగా మారినట్టు ఈ స్టడీ ఆందోళన వ్యక్తం చేసింది. గతంలో మన దేశంలో వృద్ధులు మాత్రమే గుండె సంబంధిత వ్యాధులకు గురికాగా, ప్రస్తుతం చిన్నవయసు వారిలోనూ ఈ సమస్య వేగంగా పెరుగుతున్నట్టు తెలిపింది.
దేశంలోని ప్రతి 20 మందిలో ఒకరు గుండె సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్నారు. దేశంలో సంభవిస్తున్న మరణాల్లో 25% ఇవే కావడం గమనార్హం. ఇందులో 60% అకాల మరణాలే అని రిపోర్టు వెల్లడించింది. గుండెపోటు మరణాల రేటు ప్రతి లక్ష మందికి 272గా ఉన్నట్టు నివేదిక తెలిపింది. ఇది ప్రపంచ సగటు 235 కంటే అధికంగా ఉన్నట్టు పేర్కొన్నది. దేశంలో చోటుచేసుకుంటున్న మరణాల్లో సగం మంది చికిత్సలో జాప్యంతోనే గుండెపోటుతో మరణిస్తున్నట్టు అధ్యయనం స్పష్టంచేసింది.
గ్రామీణ ప్రాంతాల్లో ముందస్తు స్క్రీనింగ్ విధానాన్ని మెరుగుపర్చాలని ఈ అధ్యయనం తెలిపింది. ‘గోల్డెన్ అవర్’లో అందాల్సిన చికిత్సలో జాప్యానికి అడ్డుకట్ట వేసేందుకు ‘ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్’ను అధునాతన పద్ధతుల్లో అభివృద్ధి చేయాలి. పల్లెల్లో హెల్త్‌కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను విస్తరించాలి. డైట్, వ్యాయామం, ఒత్తిడి నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. గుండెపోటు నివారణకు ప్రజలు డిజిటల్ హెల్త్ టూల్స్‌ను వినియోగించేలా చూడాలని ఈ రిపోర్టు సూచించింది.