మెదక్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. మెదక్ జిల్లాలోని మెదక్, నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మెదక్ ఆర్డీవో కార్యాలయంలో ఆర్వో కార్యాలయం, నర్సాపూర్ ఆర్డీవో కార్యాలయంలో ఆర్వో కార్యాలయాన్ని ఏర్పాటుచేశారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. బుధవారం ఐదో రోజు రెండు నియోజకవర్గాల్లో 8 నామినేషన్లు దాఖలయ్యాయి. మెదక్ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అందులో ఒకరు భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై) నుంచి నామినేషన్ వేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా చేగుంట మండలం చిన్నశివనూర్ గ్రామానికి చెందిన ఎడ్ల కుమార్, టేక్మాల్ మండలం ఎలకుర్తి గ్రామానికి చెందిన పట్లోళ్ల బాపురెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. భారత చైతన్య యువజన పార్టీ(బీసీవై) నుంచి మెదక్ పట్టణానికి చెందిన వనపర్తి రోహిత్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను మెదక్ రిటర్నింగ్ అధికారి అంబదాస్ రాజేశ్వర్ స్వీకరించారు.
నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి బుధవారం ఐదు నామినేషన్లు దాఖలు చేశారు ఇందులో బీఆర్ఎస్ అభ్యర్థి వాకిటి సునీతాలక్ష్మారెడ్డి తరఫున ఒక నామినేషన్ దాఖలైంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆవుల రాజిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రెబల్ అభ్యర్థిగా గాలి అనిల్‌కుమార్ రెండు సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. బీజేపీ నుంచి మురళీయాదవ్ తరఫున ఒక నామినేషన్ దాఖలైంది.
నామినేషన్ల దాఖలుకు సంబంధించి మెదక్ జిల్లాలో మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లోని ఆర్డీవో కార్యాలయాల్లో రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆయా రిటర్నింగ్ అధికారులు అంబదాస్ రాజేశ్వర్, శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రెండు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. కౌంటర్ నంబర్ 1 వద్ద నామినేషన్ల దరఖాస్తు పత్రాలు అందుబాటులో ఉంచారు. కౌంటర్ నంబర్ 2 వద్ద సహాయ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. అభ్యర్థుల వివరాలు పరిశీలించుకుని, సందేహాలను పరిష్కరించుకుని రిటర్నింగ్ అధికారికి అందజేసేలా ఈ సౌకర్యం కల్పించారు.