మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. మెదక్ జిల్లా వ్యాప్తంగా 298 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో 19,700 మంది సభ్యులు ఉండగా, వీరందరికి ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేసి వాటిని పెంచి విక్రయించుకుని ఆర్థికంగా నిలదొక్కుకునేలా ప్రోత్సహిస్తున్నది. తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ, సబ్సిడీపై వాహనాల అందజేత, నీటివనరుల్లో పూడికతీత కార్యక్రమాలతో ఏటా మత్స్య సంపద పెరిగి చేతినిండా ఉపాధి లభిస్తున్నది. ప్రస్తుతం వానకాలం ప్రారంభమవడంతో చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లో 5.4 కోట్ల చేపపిల్లలు వదలాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నెల చివర్లో లేదా ఆగస్టులో చేపపిల్లలు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. నీటి వనరులను కచ్చితంగా గుర్తించేందుకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ శాటిలైట్ సర్వే నిర్వహించి వివరాలను ప్రభుత్వానికి అందజేసింది. ఈ నివేదిక ఆధారంగా నీటి సామర్థ్యాన్ని బట్టి చేపపిల్లలను వదిలేందుకు మత్స్య శాఖ సిద్ధమైంది.
– మెదక్ (నమస్తే తెలంగాణ), జూలై 4
మెదక్, జూలై 4 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలో మత్స్య సంపద మరింత పెరగనున్నది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఉచిత చేప పిల్లల పంపిణీని రాష్ర్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన తర్వాత మత్స్యకారుల జీవితాలు పూర్తిగా మారిపోయింది. కొన్ని రోజులుగా చెరువులు, ప్రాజెక్టులలో చేపలు పడుతున్న మత్స్యకారులు చేపల ఉత్పత్తిని చూసి ఎంతగానో సంబురపడుతున్నారు. మెదక్ జిల్లాలో గతంలో ఎన్నడూ లేనివిధంగా చెరువులు, ప్రాజెక్టుల్లో నీరు నిండడంతో చేపల పెంపకానికి కూడా అన్ని కలసొచ్చినట్లయింది. ఇప్పటికే జిల్లాలోని అన్ని చెరువుల్లో చేపలు పట్టి అమ్మకాలు జరుపుతున్నారు.
19,700 మంది మత్స్యకారులకు ఉపాధి..
జిల్లా వ్యాప్తంగా 298 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో 19,700 మంది సభ్యులు ఉండగా, వారు ఉచిత చేప పిల్లల పంపిణీ ద్వారా ఉపాధి లభించి లబ్ధిపొందుతున్నారు. ఈ ఏడాది వంద శాతం రాయితీతో ఉచితంగా చేప పిల్లలను ప్రభుత్వం చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల సామర్థ్యానికి అనుగుణంగా వదలనున్నారు. ఇందుకోసం టెండర్లను దాఖలు చేసిన కాంట్రాక్టర్లలో అర్హులను ఎంపిక చేసేందుకు జిల్లా అదనపు కలెక్టర్ నేతృత్వంలో కమిటీ బృందాన్ని నియమించింది. పశు సంవర్ధకశాఖ, మత్స్యశాఖ, సహకార శాఖ అధికారులతో కూడిన ప్రత్యేక బృందాన్ని నియమించారు.
సంపద పెంచేందుకు ప్రత్యేక చర్యలు..
మత్స్యశాఖ అధికారులు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ప్రాజెక్టులు, చెరువులు తదితర నీటి వనరుల్లో చేప పిల్లలను వదులుతున్నారు. ఇందుకోసం ముందుస్తుగా నీటి వనరులులను గుర్తిస్తారు. ఆ నీటి వనరు సామర్థ్యంలో సగం నీరు ఉంటే సీడ్ వదులుతారు. అయితే 2015 నుంచి చెరువుల పూడికతీత ద్వారా నీటి వనరుల సంఖ్య పెరిగినట్లు గుర్తించారు. కొత్తగా ఏర్పడిన నీటి వనరులున ఖచ్చితంగా గుర్తించేందుకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా శాటిలైట్ సర్వే చేయించారు. ఈ ఏజెన్సీ అన్ని జిల్లాలో పాతవి, కొత్తగా ఏర్పడిన నీటి నవరుల సర్వే నిర్వహించి, వివరాలను ప్రభుత్వానికి అందించింది. ప్రభుత్వం సర్వే వివరాలు జిల్లాల వారీగా ఆయా జిల్లాల మత్స్య శాఖకు ఇచ్చింది. జిల్లా మత్స్య శాఖ అధికారులు సిబ్బంది సహకరంతో శాటిలైట్ సర్వేలో గుర్తించిన కొత్త, పాత నీటి వనరుల వద్దకు వెళ్లి జియోట్యాగింగ్ చేస్తారు.
సబ్సిడీలో వాహనాల పంపిణీ..
మత్స్యకారులకు చేపలను మార్కెట్, ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం తరఫున వాహనాలను కూడా అందజేశారు. ఇప్పటికే మెదక్ జిల్లాలోని మత్స్యకార సొసైటీ సభ్యులకు సబ్సిడీపై వాహనాలు అందించారు. ఇందులో 2980 మోపెడ్లు, వలలు 683 మందికి, డబ్బాలు 597 మందికి, టెంట్లు 21, లగేజ్ ఆటోలు 156, సంచార చేపల వాహనాలు 24 చేపలను తరలించేందుకు కావాల్సిన ఒక పెద్ద ట్రక్‌ను సబ్సిడీపై అందజేశారు. ఈ క్రమంలో జిల్లాలో పట్టిన చేపలను స్థానిక మార్కెట్లకు తరలిస్తున్నారు.
5 కోట్ల 4 లక్షల చేప పిల్లలు..
మెదక్ జిల్లాలో 1614 చెరువుల్లో 5 కోట్ల 4 లక్షల చేప పిల్లలు పంపిణీ చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. చెరువుల్లో చేప పిల్లలు వేయడంతో మత్స్యకారులకు ఉపాధి లభించనున్నది. చెరువులు, కుం టల్లో బొచ్చె, రాహు, బంగారుతీగ రకాలను పంపిణీ చేయనున్నారు. గత ఏడాది ఆగస్టు నెల నుంచి చేప విత్తనాలను ప్రభుత్వం పంపిణీ చేయగా, ఈ ఏడాది జూలైలోనే చేప పిల్లలను వదిలేలా చర్యలు చేపడుతున్నారు.
త్వరలో చేప పిల్లల పంపిణీకి ఏర్పాట్లు..
మెదక్ జిల్లాలో 1614 చెరువుల్లో 5 కోట్ల 4 లక్షల చేప పిల్లలను వదిలేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. 263 సొసైటీలు ఉండగా, 19,700 మంది మత్స్యకారులున్నారు. జూలై చివరి వారంలో లేదా ఆగస్టులో చేప పిల్లలను పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో 19,700 మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి.
– రజిని, మత్స్యశాఖ జిల్లా అధికారి