సిద్దిపేట, డిసెంబర్ 5: బీఆర్ఎస్ పాలనలో నాటి సీఎం కేసీఆర్ గంగపుత్రులకు పెద్దపీట వేశారని, వారి మేలు కోరి కాళేశ్వరం నీళ్లు తెచ్చి, నీటి వనరుల్లో ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసి ఉపాధి కల్పించారని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు.శుక్రవారం సిద్దిపేట గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగాభవానీ దేవి ఆలయ వారికోత్సవాల్లో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ.. గంగాభవానీ ఆలయాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నామని, పకన ఫంక్షన్ హాల్ అద్భుతంగా నిర్మించుకున్నట్లు చెప్పారు. సిద్దిపేట కోమటి చెరువును, సిద్దిపేటలో ఉండే అన్ని చెరువులను అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో సిద్దిపేటలో చేపలు పెంచి, కోల్‌కతాకు ఎగుమతి చేశామని గుర్తుచేశారు. సిద్దిపేట చేపల మారెట్ను రాష్ట్రంలోనే ఆదర్శంగా నిర్మించుకున్నామని తెలిపారు. సిద్దిపేట చేపల మారెట్ను ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాల నుంచి వచ్చి చూసి నేర్చుకునేంత అద్భుతంగా నిర్మించుకున్నట్లు హరీశ్‌రావు అన్నారు.
బీఆర్ఎస్ పాలనలో బంగారంలాంటి చేపల పంట పండిందని, గంగపుత్రులు ఎంతో సంతోషంగా ఉన్నారని గుర్తుచేశారు. గంగా భవానీ అమ్మవారి దయతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు హరీశ్‌రావు పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వంటేరు ప్రతాప్‌రెడ్డి, రాజనర్సు, సంపత్‌రెడ్డి, సాయి కుమార్, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, గంగపుత్ర సంఘం నాయకులు గౌటి ఆశోక్, గౌటి రాజు,మల్లేశం,అశోక్ తదితరులు పాల్గొన్నారు.