పటాన్చెరు రూరల్, జూలై 13 : అగ్గి పుడితే సర్వం బూడిదే… అగ్ని ప్రమాదం సంభవిస్తే నిమిషాల్లో దావానంలా వ్యాపించి ఆస్తినష్టంతో పాటు ప్రాణనష్టం సంభవిస్తున్నది. ఫైరింజన్లు వచ్చేలోపు జరగాల్సిన నష్టం జరుగుతున్నది. పారిశ్రామికవాడ ప్రజలకు అగ్ని ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. పరిశ్రమల్లో రియాక్టర్ పేలుళ్లు, డ్రయర్ల పేలుళ్లు, స్క్రాప్యార్డుల్లో మంటలు, సాల్వేంట్లు తగలబడి చెలరేగుతున్న మంటలతో ఆస్తి, ప్రాణనష్టం సంభవిస్తున్నది.
జూన్ 30న సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి పరిశ్రమలో చెలరేగిన ప్రమాదంలో 44మంది కార్మికులు మరణించడం, 8మంది కార్మికులు గల్లంతైన సంగతి తెలిసిందే. వారు కూడా మరణించినట్టుగా పరిశ్రమ అటెండెన్స్ రిజిస్టర్స్ చెబుతున్నాయి. మరో ఆరుగురి పరిస్థితి దవాఖానల్లో విషమంగానే ఉంది. ఫైర్ సేఫ్టీ లేకపోవడం, పరిశ్రమల భద్రత శాఖ, బాయిలర్ల శాఖ అధికారులు తూతూమంత్రంగా చేస్తున్న తనిఖీలతోనే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దేశ చరిత్రలోనే సిగాచిలో ప్రమాదం రెండోదిగా నిలిచింది.
మరోవైపు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న అపార్టుమెంట్లు, భారీ భవనాల్లో సేఫ్టీ కరువైంది. అగ్గిరాజుకుంటే ప్రాణనష్టం ఊహించలేనంతగా నష్టం జరిగే పరిస్థితులు ఉన్నాయి. అపార్టుమెంట్ల వద్దకు ఫైరింజన్లు చేరలేని దుస్థితిలో ఇరుకైన రోడ్లు ఉంటున్నాయి. అంత ఎత్తుకు బక్కెట్లతో కానీ, బిందెలతో నీరు చిమ్మే పరిస్థితే ఉండదు. అపార్టుమెంట్లకు పర్మిషన్లు ఇచ్చినప్పుడు ఫైరింజన్లు భవంతుల చుట్టూ తిరగేలా స్థలం వదలాలి. గజం జాగా వదలకుండా కడుతున్న భవంతులు భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నా యి.
పలు వ్యాపార సంస్థలు, మాల్స్, సూపర్ మార్కె ట్లు, స్కూల్స్, ఫంక్షన్ హాల్స్, థియేటర్స్‌లోనూ ఫైర్ సేఫ్టీని వ్యాపారులు పాటించడంలేదు. కింద హోటల్స్, పైన స్కూల్స్ ఉండటం పటాన్చెరు ప్రాం తంలోనే చూడవచ్చు. హోటల్లో గ్యాస్ సిలిండర్లు పేలిపోతే పైన తరగతి గదుల్లో ఉన్న పాఠాలు వింటు న్న చిన్నారులకు ప్రాణాంతకం. మేలో హైదరాబాద్‌లోని చార్మినార్‌లో ఒక ఇంట్లో చెలరేగిన మంటలు 17మంది ప్రాణాలను పొట్టనపెట్టుకున్న సంఘటన నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఎం తైనా ఉంది.
పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంలోని భారీ, మధ్యతరహా, చిన్న తరహా పరిశ్రమల్లో ఫైర్ సేఫ్టీ పెద్దగా అమలు కావడం లేదు. జూన్ 30న ఉదయం 9.18 గంటలకు సిగాచి పరిశ్రమలో సంభవించిన పేలుడు దుర్ఘటనకు సేఫ్టీ నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా తెలుస్తున్నది. తరుచూ తనిఖీలు నిర్వహించాల్సిన డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆ పని చేయలేదు. రాష్ట్రస్థాయి అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలతో ఏ పరిశ్రమను తనిఖీ చేయాలన్నా, రాష్ట్ర అధికారులు ఇచ్చే ఆదేశాలు పాటించాలి. ర్యాండం పద్ధ్దతిలో సూచించిన పరిశ్రమల్లోనే అధికారులు తనిఖీలు నిర్వహించాలి.
రాజకీయ నాయకుల ప్రాబల్యం, అధికార పార్టీకి అనుబంధంగా ఉండే పరిశ్రమలకు అనేక రకాల రక్షణ లభిస్తున్నది. దీని మూలంగా ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఫార్మా, కెమికల్ పరిశ్రమల్లో చెలరేగే అగ్ని ప్రమాదాలను నిలవరించలేని దుస్థితి ఉంది. పరిశ్రమల్లో పెద్దగా శిక్షణ పొందిన ఫైర్ సేఫ్టీ బృందాలు ఉండడం లేదు. సేఫ్టీ పరికరాలు అంతంతమాత్రమే. బయటనుంచి వచ్చే ఫైరింజన్లే మంటలను ఆర్పాలి. పైపెచ్చు మంటలను ఫోం వాడి ఆర్పాల్సి ఉంటుంది.
కొన్నిసార్లు తెచ్చుకున్న ఫోం అయిపోతే పెద్ద పరిశ్రమలు ఫోం సమకూర్చి మంటలను ఆర్పడంలో సాయం చేయడం కనిపిస్తున్నది. ఒక పరిశ్రమకు, మరో పరిశ్రమకు మధ్య ఎలాంటి గ్యాప్ లేకపోవడంతో మంటలు ఇతర పరిశ్రమలకు వ్యాపించే అవకాశం ఉంది. ఏటా పదుల సంఖ్యలో పరిశ్రమల్లో కార్మికులు అగ్ని ప్రమాదాల్లో చిక్కుకుని చనిపోతున్నారు. ఎందరో గాయాలతో నరకయాతన అనుభవిస్తున్నారు. 24గంటలు అగ్ని ప్రమాదాలు ఇక్కడ పొంచి ఉంటాయి.
ఇండస్ట్ట్రియల్ సేఫ్టీని చూడాల్సిన పరిశ్రమల భద్రతశాఖ అధికారులు విఫలం చెందుతున్నారనడానికి జరుగుతున్న ప్రాణనష్టమే నిదర్శనం. ఆదివారం రోజు పాశమైలారంలోనే మరో అగ్ని ప్రమాదం సంభవించి సమీప గ్రామాల ప్రజలకు ఉలిక్కిపడేలా చేసింది. ఎన్విరో వేస్ట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్లోలారీపై నుంచి కార్బన్ సంచులను దింపుతున్న ఐదుగురు కార్మికులకు ఒక్కసారిగా కిందినుంచి అగ్ని రాజకుని చుట్టుముట్టింది.
కిందనున్న మరో కార్మికుడు అగ్ని అని హెచ్చరించడంతో కార్మికులు లారీ పైనుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. చూస్తుండగానే అగ్ని లారీని, దాని పక్కన ఉన్న స్టాక్‌ను అంటుకుని బూడిదగా మార్చింది. పరిశ్రమలో మంటలు అర్పేందుకు కార్మికులు ప్రయత్నించినా నామమాత్రంగా ఉన్న ఫైర్ సేఫ్టీ పనిచేయలేదు. డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీలు వేస్తామని, ఎలాంటి ఆపద వచ్చినా తక్షణం స్పందించి వాటిని నిలువరిస్తామని ప్రజాప్రతినిధులు, అధికారులు చెబుతున్న మాటలు ఉత్తవిగా మారుతున్నాయి.
పటాన్చెరు పారిశ్రామికవాడ హైదరాబాద్‌కు సమీప దూరంలో ఉండడంతో పలు భారీ సూపర్ మార్కెట్లు, మాల్స్, సినిమా థియేటర్స్ వెలిశాయి. వేలాది మంది ఇక్కడ షాపింగ్ కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం వస్తున్నారు. ఫైర్ సేఫ్టీ తూతూ మంత్రంగానే ఉంటున్నది. మరో పక్క ఫంక్షన్ హాల్స్లోను గ్యాస్వాడి వంటలు చేస్తున్నారు. విద్యుత్ అలంకరణలు చేస్తున్నారు.
అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటే వందలాదిమంది వాటితో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇప్పుడు స్కూల్స్ ను వాణిజ్య సముదాయాల్లో ఏర్పాటు చేస్తున్నారు. విద్యాశాఖ అధికారుల కక్కుర్తి విద్యార్థుల ప్రాణాలమీదకు తెస్తున్నది. వందలాది మంది చిన్నారులు క్లాసుల్లో ఉన్న సమయంలో కింద ఉన్న హోటల్స్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల ద్వారా అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటే జరిగే నష్టం ఊహించలేనిది. వ్యాపార సంస్థల్లో, థియేటర్లలో, ఫంక్షన్ హాల్స్‌లో, దవాఖానల్లో ఫైర్ ఫైటింగ్ వ్యవస్థ బలోపేతం చేయడంపై ఫైర్ సేఫ్టీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
పటాన్చెరు ప్రాంతంలో పుట్టగొడుగుల్లా అపార్టుమెంట్లు, భారీ భవనాలు కడుతున్నారు. ఎక్కడా ఒక ఫైరింజన్ వెళ్లే దారి ఉండడం లేదు. అపార్టుమెంట్లలో మంటలు చెలరేగితే ఫైరింజన్ అక్కడికి వెళ్లి మంటలను అర్పే పరిస్థితి ఉండడం లేదు. పైగా కిటికీలకు, వరండాలకు ఇనుప జాలీలు పెడుతున్నారు. కష్టకాలంలో పై అంతస్తులకు చేరుకుని ఆ జాలీలను ఎవరు తొలిగించి అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నవారిని రక్షించగలరు. అపార్టుమెంట్ల ముందు సెట్‌బ్యాక్ వదడం లేదు.
ట్రాన్స్ఫార్మర్లు రోడ్లపైనే ఏర్పాటు చేస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్లకు ఎర్తింగ్ కూడా పెట్టట్లేదు. ఎర్తింగ్లేక షార్ట్ సర్క్యూట్ చెలరేగి మంటలు అంటుకుంటున్నాయి. చార్మినార్‌లో చోటు చేసుకున్న సంఘటన ఇలాంటిదే. 17మంది ప్రాణాలను బలిగొన్నది విద్యుత్ వైఫల్యమేనని ప్రాథమికంగా తెలిసింది. ఇండ్లలో వాడే వంటగ్యాస్ సిలిండర్లు పేలినా, గ్యాస్ లీకై మంటలు చెలరేగవచ్చు. అపార్టుమెంట్లలో ఫైర్ సేఫ్టీ అనేది దాదాపుగా ఎక్కడా కనిపించంలేదు. ఫైర్ సేఫ్ట్టీకి అగ్నిమాపక బృందాలు, విద్యుత్ రక్షణకు విద్యుత్‌శాఖ అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.