మేడ్ ఇన్ కొరియా
నెట్‌ఫ్లిక్స్: స్ట్రీమింగ్ అవుతున్నది
తారాగణం: ప్రియాంక మోహన్, రిషికాంత్,
పార్క్ హే జిన్, జే హ్యూన్ జాంగ్ తదితరులు
దర్శకత్వం: రా కార్తీక్
కొరియన్ సినిమాలపైనా మనవాళ్లు ఆసక్తి చూపిస్తుంటారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కే కె-డ్రామాలను బాగానే ఆదరిస్తుంటారు. కె-పాప్ మ్యూజిక్ అన్నా చెవి కోసుకుంటారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ ఓజీ హీరోయిన్ ప్రియాంక మోహన్ కీలకపాత్రలో కొరియా నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కింది. నేరుగా నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు సహా తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో స్ట్రీమింగ్ అవుతూ.. రికార్డ్ వ్యూస్ సాధిస్తున్నది. కథలోకి వెళ్తే.. తమిళనాడులోని ఓ పల్లెటూరికి చెందిన అమ్మాయి.. షన్బా (ప్రియాంక మోహన్). ఆమెకు చిన్నప్పటి నుంచీ కొరియన్ సినిమాలు, కొరియన్ పాప్ మ్యూజిక్ అంటే పిచ్చి. అందుకే, ఎలాగైనా కొరియా వెళ్లాలని అనుకుంటుంది. పాఠశాల రోజుల నుంచే కొరియన్ భాష నేర్చుకుంటుంది.
కొరియన్లలా తినడం కూడా అలవాటు చేసుకుంటుంది. పెద్దయ్యాక తనే మారుతుందని తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ, వారికి షాక్ ఇస్తూ.. ఓ అనూహ్య నిర్ణయం తీసుకుంటుంది షన్బా. ప్రియుడితో కలిసి దక్షిణ కొరియాకు బయల్దేరుతుంది. కానీ, విమానం ఎక్కిన తర్వాత తన బాయ్‌ఫ్రెండ్ హ్యాండ్ ఇస్తాడు. అయినా ఒంటరిగానే సౌత్ కొరియా రాజధాని సియోల్‌లో అడుగుపెడుతుంది. ఈ క్రమంలో షన్బాకు ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? చేతిలో ఉన్న డబ్బులు అయిపోయిన తర్వాత ఆమె ఏం చేస్తుంది? తమను కాదనుకుని వెళ్లిన షన్బా విషయంలో.. ఆమె తల్లిదండ్రులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? కొరియాలో పరిచయమైన అబ్బాయి (పార్క్ హే జిన్) ఎవరు? తిరిగి ఆమె ఇండియాకు వస్తుందా? అక్కడే ఉండిపోతుందా? అనే విషయాలు తెలియాలంటే.. మేడ్ ఇన్ కొరియా వీక్షించాల్సిందే!