సిద్దిపేట, జూన్ 16 : సిద్దిపేట స్వచ్ఛతలో మేటి అని, సఫాయి కార్మికులు కృషి మరువలేనిదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం సిద్దిపేటలోని కొండా భూదేవి గార్డెన్లో పట్టణ ప్రగతి దినోత్సవంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. అందరూ సైనికుల్లా పనిచేయడంతోనే స్వచ్ఛ సిద్దిపేట సాధ్యమైందన్నారు. కాంగ్రెస్ హయాంలో రూ.6,800 జీతం ఇచ్చేవారని, ఇప్పుడు రూ.15,800 పెంచుకున్నామన్నారు. నాడు కనీస వేతనం ఇచ్చే వారు కాదన్నారు. తొమ్మిదేండ్లలో సీఎం కేసీఆర్ రెండున్నర రేట్లు జీతం పెంచారన్నారు. నాటి పాలకులు సఫాయి కార్మికులంటే చిన్న చూపు చూసేవారన్నారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణంతో సిద్దిపేట స్వచ్ఛతకు రెండో అడుగు పడిందన్నారు. యూజీ డీ నిర్మాణంతో మురుగునీటి కాల్వలు ఎండిపోవడంతో దోమలు, ఈగలు లేకుండా నివారించామన్నారు. పట్టణ ప్రజలు సహకరించడంతోనే చెత్త సేకరణలో సిద్దిపేట ది బెస్ట్‌గా నిలిచిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుమార్కెట్లు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు, చక్కటి వైకుంఠధామాలు ఏర్పాటు చేసుకున్నామన్నారు.
సిద్దిపేటకు 22 అవార్డులు వచ్చాయన్నారు. సమాజానికి చెత్త సేకరణలో గొప్ప సంస్కారం చూపారన్నారు. సిద్దిపేట పేరు లేకుండా కేంద్రం, రాష్ట్రం నుంచి అవార్డులు ఉండవన్నారు. చెత్త దైవత్వంతో సమానమన్న మహాత్ముడి మాటను నిజం చేసింది సిద్దిపేట అన్నారు. కోమటి చెరువు కోటి అందాలతో వెలుగుతూ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందిందన్నారు. సిద్దిపేటలో కప్పలకుంట, మచ్చవానికుంటను సుందరీకరించనున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ హయాంలోనే మున్సిపాలిటీలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. 60 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ మార్కెట్లను కూడా కట్టలేదన్నారు. సిద్దిపేటలో సమీకృత మార్కెట్, మోడల్ రైతు బజారును నిర్మించుకున్నామన్నారు. శ్రీరాములకుంట, వైకుంఠధామాలు నేడు పార్కులను తలపిస్తున్నాయన్నారు. ప్రభుత్వ దవాఖానలు అంటే గతంలో దుర్గంధ పూరితంగా, ప్రజలు వెళ్లలేని స్థితిలో ఉండేవన్నారు. నేడు సీఎం కేసీఆర్ హయాంలో సిద్దిపేటలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసుకొని ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నామన్నారు. తడి చెత్త నుంచి గ్యాస్ ఉత్పత్తి చేసి ఆదాయం పొందుతున్న ఏకైక మున్సిపాలిటీ సిద్దిపేట అన్నారు. సిద్దిపేట ఆరోగ్య క్షేత్రంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. వెయ్యి పడకల దవాఖాన త్వరలో అందుబాటులోకి రానున్నదని, దీంతో గుండె, క్యాన్సర్‌కు సంబంధించిన శస్త్ర చికిత్సలు జరగనున్నాయన్నారు.
మహిళా ఆరోగ్యం కోసం సిద్దిపేటలో రుతుప్రేమ కార్యక్రమాన్ని తీసుకువచ్చామన్నారు. విద్యాక్షేత్రంగా సిద్దిపేటను తీర్చిదిద్ది, విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఆరు నెలల్లో అబ్బురపడేలా సుమారు రూ.150 కోట్లతో రంగనాయకసాగర్‌ను అద్భుతమైన పర్యాటక క్షేత్రంగా మార్చుతున్నామన్నారు. సిద్దిపేటకు పట్టణ ప్రగతి దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో స్వచ్ఛతలో మొదటి బహుమతి తీసుకున్నట్లు తెలిపారు. సిద్దిపేటలో అమలు చేస్తున్న స్వచ్ఛత కార్యక్రమాలు చూసి నేర్చుకునేందుకు తమిళనాడులోని తిరుచ్చి మున్సిపల్ పాలకవర్గం ప్రత్యక్షంగా చూసి నేర్చుకున్నారన్నారు. సఫాయి కార్మికులైన, మంత్రినైన ప్రజా సేవకులమేనని.. అందరం ప్రజలకు సేవ చేద్దామన్నారు. స్వచ్ఛ సిద్దిపేట విజయం సిద్దిపేట ప్రజలందరి విజయమని, అభివృద్ధి, స్వచ్ఛ సిద్దిపేట నిరంతర కృషితో ముందుకు సాగుదామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్, మున్సిపల్ వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు, మున్సిపల్ కమిషనర్ సంపత్‌కుమార్, ఆయా వార్డుల కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలందించిన సఫాయి కార్మికులు, మున్సిపల్ సిబ్బంది, పాలకవర్గ సభ్యులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.
దేశంలో సిద్దిపేట నంబర్‌వన్
సిద్దిపేట దినదినాభివృద్ధి సాధిస్తూ దేశంలో నంబర్‌వన్‌గా నిలిచిందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌డ్డి అన్నా రు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులను చూశామని, గత పాలన, నేటి పాలనకు ఎంత తేడా ఉందో కండ్లముందు కనిపిస్తున్నదన్నారు. దేశమంతా తెలంగాణ పనితీరు గమనిస్తున్నదన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షే మ, అభివృద్ధి కార్యక్రమాలు తమ రాష్ర్టాల్లో ఎందు కు జరగడం లేదన్న చర్చ దేశ వ్యాప్తంగా మొదలైందన్నారు. అభివృద్ధి కావాలంటే మూడోసారి బీఆర్ఎస్కు ఘన విజయం అందించాలన్నారు.
-మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి