సిద్దిపేట, మే 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఇప్పటికే ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, పంటలకు గిట్టుబాటు ధర లేక నష్టాలు, ప్రకృతి వైపరీత్యాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులపై ఇప్పుడు ఎరువుల ధరల పెరుగుదలతో మరో భారం పడుతుంది. డీఏపీ, పొటాష్, కాంప్లెక్స్ ఎరువులు, సూక్ష్మ పోషకాలు అన్ని ఎరువుల ధరలు పెరిగాయి. ఎరువుల ధరలు అమాంతం పెరగడంతో రైతులు బెంబేలెత్తి పోతున్నారు. 50 కిలోల కాంప్లెక్స్ ఎరువుల బస్తాకు సగటున రూ 300 వరకు, మరికొన్ని బస్తాకు రూ. 350 వరకు పెరిగాయి. కాంప్లెక్స్ ధరలు చూస్తే (16-16-16) పాత ధర రూ. 1,675 ఉంటే కొత్త ధర రూ. 2,050 ఉంది. కాంప్లెక్స్ ( 24-24-0) పాత ధర రూ. 2,000 ఉంటే కొత్త ధర రూ. 2,300 ఉంది. కాంప్లెక్స్ (20-20-13) పాత ధర రూ. 1800 ఉంటే కొత్త ధర రూ. 2150 ఉంది. ఇలా అన్ని కాంప్లెక్స్‌లపై ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతానికి డీఏపీ, యూరియా ధరలు స్థిరంగానే ఉన్నాయి.
ఎరువుల కొరతను ఆసరాగా చేసుకుని కొందరు ప్రైవేట్ డీలర్లు రైతులను నిలువునా దోచుకుంటున్నారు. ఎమ్మార్పీ కంటే ఎకువ ధరలకు ఎరువులు అమ్ముతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఒక డీఏపీ బస్తా కావాలంటే మరో పురుగుమందు కూడా కొనాలి అంటూ బలవంతపు విక్రయాలు చేపడుతున్నారు. రైతులకు సరైన బిల్లులు ఇవ్వకపోవడం, స్టాక్ లేదని చెప్పి బ్లాక్ మారెట్‌కు తరలించడం వంటి సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నా, గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మాత్రం మారడం లేదని రైతులు చెబుతున్నారు.
గత వానకాలంలో భారీగా యూరియా భారీగా ఏర్పడింది. మెదక్ జిల్లాకు 29 వేల టన్నులు,సంగారెడ్డి జిల్లాకు 35 వేల టన్నులు, సిద్దిపేట జిల్లాకు 40 వేల టన్నుల యూరియా అవసరం ఉంటే, ఆ మేరకు ప్రభుత్వం సరఫరా చేయలేక పోయింది. గత వానకాలం సిద్దిపేట జిల్లాలో 5,63,005 ఎకరాలు, మెదక్ జిల్లాలో 3,20,514 ఎకరాలు, సంగారెడ్డి జిల్లాలో 7,48,000 ఎకరాల్లో రైతులు పంటలు పండించారు. ఈసారి వానకాలంలో ఆ మేర పంటలు సాగుకానున్నాయి. ఈసారి సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని రైతులు కోరుతున్నారు.
రైతు పండించిన పంటలకు సరైన ధర రావ డం లేదు. వరి కొనుగోళ్లలో ఆలస్యం, మొక జొన్నకు గిట్టుబాటు ధర లేకపోవడం, పత్తికి మారెట్ పడిపోవడం, మిర్చి రైతుకు నష్టా లు.. ఇలా ప్రతి పంటలో రైతు నష్టాలనే చూస్తున్నాడు. ఒకవైపు పెట్టుబడులు పెరు గుతుంటే, మరోవైపు మారెట్లో ధరలు పడి పోవడం రైతుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తున్నది. పంట పండితే ధర లేదు.. ధర ఉం టే పంట లేదు అనే పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు చేయూత కరువైంది. సకాలంలో ప్రభుత్వం రైతుభరోసా వేయడం లేదు. రైతుబీమా అమలు కావడం లేదు. అన్నీ కష్టాలే ఎదురవుతున్నాయి.
ఒకప్పుడు రైతు తన దగ్గర ఉన్న డబ్బులతోనే వ్యవసాయ పనులు ప్రారంభించేవాడు. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. విత్తనాలు కొనాలి, ఎరువులు తెచ్చుకోవాలి, కూలీలకు డబ్బులు ఇవ్వాలి, ట్రాక్టర్ ఖర్చులు పెట్టాలి, పురుగుమందులు కొనాలి.. ఇలా ప్రతి దశలో డబ్బు కావాల్సి వస్తోంది. పత్తి, మొకజొన్న, వరి, మిర్చి వంటి పంటలకు ఎకరాకు పెట్టుబడి రూ.లక్షకు చేరువవుతోందని రైతులు చెబుతున్నారు. అందులో ఎరువుల ఖర్చే ఎక్కువ భారం అవుతోంది. ముఖ్యంగా డీఏపీ బస్తా ధర పెరగడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పంట పండుతుందో లేదో తెలియదు కాని పెట్టుబడులకు వేల రూపాయల అప్పులు చేయాల్సి వస్తుండడం రైతులను కుంగదీస్తోంది.బ్యాంకుల్లో పంట రుణాలు సకాలంలో అందకపోవడంతో రైతులు ప్రైవేట్ అప్పులపై ఆధారపడుతున్నారు. గ్రామాల్లో వడ్డీ వ్యాపారులు రైతుల బలహీనతను ఆసరాగా చేసుకుని భారీ వడ్డీకి డబ్బులు ఇస్తున్నారు.ఎరువులు కొనాలంటే అప్పు తప్ప దు.. పంట వచ్చాక చెల్లిస్తామని చెప్పి రైతులు అప్పు తీసుకుంటున్నారు. చివరికి పంటకు ధర రాక అప్పులే మిగులుతుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.చాలామంది రైతులు బంగారం తాకట్టు పెట్టి, కొం దరు భూమి పత్రాలు పెట్టి అప్పులు తెచ్చుకుంటున్నారు. వ్యవసాయం లాభసాటి కాకపోయినా, బతుకుదెరువు కోసం రైతు సాగు మానలేని పరిస్థితి గ్రామాల్లో నెలకొంది.