మెదక్, జనవరి 9 (నమస్తే తెలంగాణ) : లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఓటరు ముసాయిదా జాబితాను జిల్లా అధికార యంత్రాంగం విడుదల చేసింది. మెదక్ జిల్లావ్యాప్తంగా 4.41,980 లక్షల మంది ఓటర్లు ఉన్నట్టు అధికారులు తేల్చారు. ఇందులో పురుష ఓటర్లు 2,13,256 మంది, స్త్రీలు 2,28,341మందితోపాటు ఇతరులు 11 మంది ఉన్నా రు. పురుష ఓటర్ల కంటే ్రస్త్రీలు 14,713 మంది ఎక్కువగా నమోదయ్యారు. ఓటరు జాబితాలను మండల కేంద్రాలు, గ్రామాల వారీగా అందుబాటులో ఉంచారు.
ఈ నెల 20, 21 తేదీల్లో ఓటరు నమోదుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నారు. బీఎల్వోలు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో రెండు రోజులపాటు ఓటర్లకు అందుబాటులో ఉంటారు. ఓటరుగా పేరు నమోదు, పేరు తొలిగింపు, పోలింగ్ కేంద్రం మార్పు, పేర్లలో తప్పులుంటే బీఎల్వోల వద్దకు వచ్చి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిసున్నారు. ముసాయిదా ఓటరు జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 21వ తేదీ వరకు తహసీల్ కార్యాలయాల్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఓటరు జాబితాలో పేరు లేనివారు ఫారం-6లో వివరాలు నమోదు చేసి, ఆన్లైన్ లేదా తహసీల్ కార్యాలయాల్లో దరఖాస్తులను అందించాలి. ముసాయిదా ఓటరు జాబితాపై వచ్చిన అభ్యంతరాలు, ఓటరు నమోదు, సవరణల కోసం వచ్చిన దరఖాస్తులను ఫిబ్రవరి 5వ తేదీ వరకు పరిశీలిస్తారు. 8న తుది ఓటరు జాబితా విడుదల చేయనున్నారు.