చేర్యాల, నవంబర్ 13: భూ సమస్య నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు నేతలు పోలీసులతో ఒత్తిడి చేస్తున్నారని ఆరోపిస్తూ పట్టణానికి చెందిన అవుశర్ల సత్యనారాయణ, అవుశర్ల వెంకటేశ్ బుధవారం చేర్యాల పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యకు యత్నించిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ విషయమై వెంకటేశ్ విలేకరులతో మాట్లాడుతూ కొన్నేండ్లుగా తమ పెద్దనాన్నతో భూ సమస్య ఉందని, దానిని పరిష్కరించుకునేందుకు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీలు జరుగుతున్నాయన్నారు.
ఈ సమస్య విషయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు తమపై పెద్దనాన్నతో పోలీసులకు ఫిర్యాదు చేయించినట్లు పేర్కొన్నారు. వెంటనే భూ సమస్యను పరిష్కరించాలని వారు పోలీసులపై ఒత్తిడి తీసుకురావడంతో వారు మమ్మల్ని పోలీస్స్టేషన్ పిలిపించారని, దీంతో మనస్తాపానికి గురై డీజిల్ పోసుకొని నిప్పు అంటించుకునేందుకు యత్నించామన్నారు. ఈ విషయమై ఎస్ఐ నరేశ్ విలేకరులతో మాట్లాడుతూ ఎవరి ఒత్తిడి తమపై లేదని, భూమి దున్నేందుకు వెళ్లిన ట్రాక్టర్ను తిప్పిపంపారని ఫిర్యాదు రావడంతో విచారణ కోసం వారిని స్టేషన్కు పిలిపించామని, ఇంతలో వారు డీజిల్ పోసుకున్నారని తెలిపారు.