తూప్రాన్/ మనోహరాబాద్/ వెల్దుర్తి, మే 11: ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం చేయాలని మెదక్ కలెక్టర్ హరీశ్ అధికారులను ఆదేశించారు. బుధవారం మనోహరాబాద్ మండలం దండుపల్లి, తూప్రాన్ మండలం యావాపూర్, మండల కేంద్రమైన మాసాయిపేటలో కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లులను ఆయన అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయా గ్రామాల్లో వరికోతలు పూర్తయ్యి, ధాన్యం ఎక్కడికక్కడే కుప్పలుగా ఉన్నాయన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ వేగం పెంచాలని, తుఫాన్ ప్రభావంతో వర్షాలు పడే అవకాశమున్నదన్నారు. అదేవిధంగా రైతులకు టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు.
రైతులు అప్రమత్తంగా ఉండి ధాన్యం తడువకుడా చూసుకోవాలన్నారు. ధాన్యం తడిస్తే ఆరబెట్టి తేమలేకుండా కేంద్రాలకు తీసుకురావాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యాన్ని ఏ రోజుకారోజు తూకం వేసి వెంట వెంటనే రైస్ మిల్లులకు తరలించాలన్నారు. రైస్ మిల్లుల యజమానులు సైతం మిల్లు సామర్ధ్యానికి అనుగుణంగా గోదాములను ఎంగేజ్‌కు చేసుకోవాలని, లారీలను ఎట్టి పరిస్థితుల్లో వెయిటింగ్లో పెట్టవద్దని సూచించారు. జిల్లాను రెండు క్లస్టర్లుగా విభజించి ఒక్కో క్లస్టర్‌కు 400 లారీలను కేటాయించామని, లారీలను కొనుగోలు కేంద్రాల్లో లేదా రైస్ మిల్లుల్లో ఉండేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు తెలిపారు. కార్యక్రమంలో మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్, జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనివాస్, ఆర్డీవో శ్యాంప్రకాశ్, పీఏసీఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి, మండల ప్రత్యేకాధికారి కృష్ణమూర్తి, తహసీల్దార్లు భిక్షపతి, మాలతి, ఏఈవో రజిత, సొసైటీ డైరెక్టర్ నర్సింలు, ఆర్ఐ ధన్సింగ్, వీఆర్వోలు, రైతులు ఉన్నారు.