మిరుదొడ్డి, జూలై 7 : యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. వానకాలం సీజన్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా వర్షాలు పడక రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు. అక్కడక్కడ కురిసిన వర్షాలకు పలువురు రైతులు మొక్కజొన్నపంట సాగుచేశారు. ఇటు మొక్కజొన్న పంటకు, అటూ వరి పంటకు యూరియా వేయాలనుకున్నా అన్నదాతలకు దొరకడం లేదు. సోమవారం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలోని చెప్యాల-అల్వాల క్రాస్ రోడ్డులోని లక్ష్మీనర్సింహ రైతు సేవా కేంద్రం వద్ద రైతులు యూరియా కోసం క్యూ కట్టినా లాభం లేకుండా పోయింది.
దుకాణం యజమానులను రైతులు నిలదీస్తే మమ్మల్ని ఏమి చేయమంటారు.. ప్రభుత్వం అందిస్తున్న యూరియా మీకు అందజేస్తున్నామని సమాధానం ఇస్తున్నారు. ఆధార్ కార్డు ఉన్నవారికి మాత్రమే ఒక్కొక్కరికి రెండు యూరియా బస్తాలు ఇవ్వడంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల రైతులు మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా సక్రమంగా యూరి యా సరఫరా చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో యూరియా కోసం గోస తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం నుంచి రైతు సేవా కేంద్రం వద్ద క్యూ కట్టే పరిస్థితి దాపురించిందని తమ బాధను వ్యక్తం చేశారు. కొందరికే యూరియా బస్తాలు దొరకడంతో మిగతా రైతులు చేసేదేమి లేక వారి గ్రామాలకు వెనుదిరిగి వెళ్లిపోయారు.