సిద్దిపేట, ఫిబ్రవరి 24: “గులాబీ అధినేత కేసీఆర్ సార్ ఉన్నప్పుడే బాగుండే..రైతు భరోసా బంద్ అయ్యింది… కరెంట్ సరిగ్గా వస్తలేదు.. కేసీఆర్ మళ్లీ సీఎం అయితేనే అన్నీ వస్తాయి” అంటూ రైతులు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావుతో చెప్పారు. సిద్దిపేట పట్టణంలోని మోడల్ రైతు బజార్లో మంగళవారం రాత్రి ఆయన రైతులతో కాసేపు ఆత్మీయంగా ముచ్చటించారు. రైతు బజార్లో అందుతున్న సేవలను రైతులను అడిగి తెలుసుకున్నారు. సౌలత్లు ఎలా ఉన్నాయి, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగారు.
ఈ సందర్భంగా రైతులు రైతు భరోసా బంద్ అయ్యిందని, కరెంట్ కూడా సరిగ్గా వస్తలేదన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు అన్నీ బాగుండే.. మంచిగా రైతు బంధు వచ్చింది.. 24 గంటల కరెంట్ ఉండే.. అన్ని సౌలత్లు ఉండే.. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని రైతులు హరీశ్‌రావుతో చెప్పారు. కేసీఆర్ పంట పంటకు రైతు బంధు ఇస్తుండే… కాంగ్రెస్ వచ్చి ఓట్లకు ఓట్లకు రైతు భరోసా ఇస్తుందని హరీశ్‌రావు రైతులతో చెప్పారు. రైతులతో ఆత్మీయంగా మాట్లాడుతూ పండించే కూరగాయల గురించి అడిగి తెలుసుకున్నారు.వారి వద్ద కూరగాయలు కొనుగోలు చేశారు.