సిద్దిపేట అర్బన్/నంగునూరు, ఏప్రిల్ 12: ఇటీవల కురిసిన వడగండ్ల వర్షంతో రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారని, వెంటనే ప్రభుత్వం రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించి ఆదుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని రాజగోపాల్‌పేటలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన పంట పొలాలను శనివారం హరీశ్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాగుల బాలమ్మ అనే మహిళా రైతు పంట నష్టం జరగడంతో తీవ్ర బాధలో ఉన్నట్లు తెలిపారు. ఓవైపు రుణమాఫీ కాక, రైతుబంధు కూడా ఆమెకు పడలేదన్నారు.
సీఎం మాటలు నమ్మి రెండు రూ.లక్షలకు పైగా రుణమాఫీ ఉంటే మీది డబ్బులు కట్టిందని బాలమ్మ తనతో ఆవేదన వ్యక్తం చేసిందన్నారు. వానకాలం రైతుబంధు ఎగ్గొట్టి, యాసంగికి సగం మందికి కూడా రైతుభరోసా వేయలేదన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికీ రైతుబంధు వేశారని, ఈ ప్రభుత్వం కోతలు పెడుతున్నదని మండిపడ్డారు. పోయిన యాసంగిలో సిద్దిపేట జిల్లాలో 1350 ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు.
కానీ, ఇప్పటివరకు ప్రభుత్వం రూపాయి పరిహారం చెల్లించలేదన్నారు. రైతుల ఆరుగాల కష్టం నేలపాలైందన్నారు. నంగునూరు మండలంలోని 11 గ్రామాల్లో సుమారు 5300 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు జరిగిందని, సిద్దిపేట జిల్లాలోనే పది వేల ఎకరాలకు పైగా పంట నష్టం జరిగిందని అధికారులు అంచనా వేసినట్లు తెలిపారు. 2500 ఎకరాల్లో హార్టికల్చర్ పంటలు దెబ్బతిన్నట్లు హరీశ్‌రావు పేర్కొన్నారు. పంట నష్టపోయిన రైతులకు తక్షణమే ఇన్పుట్ సబ్సిడీ అందించాలన్నారు.
ఇన్పుట్ సబ్సిడీతో పాటు యాసంగి రైతుభరోసా నిధులు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. రైతుబీమా విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని, చాలామంది చనిపోయిన రైతులకు రైతుబీమా అందడం లేదన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించడంతో పాటు వచ్చే వానకాలానికి రైతులకు ఉచితంగా విత్తనాలు అందించాలని కోరారు. కౌలు రైతులకు రైతుబంధు ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదన్నారు. అటు రుణమాఫీ కాక, రైతుభరోసా రాక, ఇటు పంట నష్టపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, వారికి ప్రభుత్వం అండగా నిలవాలని హరీశ్‌రావు కోరారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు, అధికారులు ఉన్నారు.