దుబ్బాక/మిరుదొడ్డి/పుల్కల్/చౌటకూరు, మే 28: సరిపడా జనుము, జీలుగ వంటి పచ్చిరొట్ట విత్తనాలు లభించక పోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీలుగ విత్తనాల కోసం మంగళవారం ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఫుల్కల్, చౌటకూరు, దుబ్బాక, మిరుదొడ్డి మండల కేంద్రాల్లోని రైతు ఆగ్రోసేవా కేంద్రాల వద్ద రైతులు నిరీక్షించారు. వేకువజామునే వచ్చి క్యూలు కట్టారు. ఎండను సైతం లెక్క చేయకుండా గంటల పాటు నిరీక్షించారు. పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు క్యూలో పెట్టి రైతులు పడిగాపులు కాశారు. దుబ్బాకలోని ఆగ్రోస్ కేంద్రానికి లారీ జీలుగ విత్తనాల బస్తాలు వచ్చాయి. కేవలం 167 మంది రైతులకు సరిపోవడంతో మిగతా రైతులు నిరాశతో వెనుదిరిగారు. చౌటకూర్‌లోని రైతు ఆగ్రోస్ సేవా కేంద్రంలో రెండు గంటల్లోనే విత్తనాలు అయిపోవడంతో క్యూలైన్ ఉన్నప్పటికీ విత్తనాలు దొరకని రైతులు చేసేదేమిలేక నిరాశతో వెనుదిరిగారు. పుల్కల్ మండల కేంద్రంలోని రెండు ఆగ్రోస్ రైతుసేవా కేంద్రాల వద్ద మంగళవారం జనుము, జీలుగ విత్తనాల కోసం రైతులు ఉదయం నుంచి పడిగాపులు కాశారు. రెండు ఆగ్రోస్ సేవా కేంద్రాలకు జనుము, జీలుగ విత్తనాలు వచ్చాయని తెలుసుకున్న రైతులు ఉదయం 6గంటలకే వచ్చి లైన్లు కట్టారు. ఒక కేంద్రంలో అయిపోయినవి అని తెలియగానే ఇంకో ఆగ్రోస్ కేంద్రం వద్దకు రైతులు భారీగా వచ్చారు. క్యూలో లేకపోతే జీలుగ విత్తనాలు దొరకవేమో అనుకొని రైతులు క్యూలో పట్టా పాస్‌బుక్కులు, ఆధార్ కార్డులను పెట్టారు. రెండు ఎకరాలకు ఒకటే బస్తాను ఇవ్వడంతో రైతులు కాస్త ఇబ్బందులకు గురయ్యారు.
గంటల తరబడి లైన్లో నిలబడితే రెండకరాలకు ఒకటే బస్తానా అంటూ నిరాశకు గురయ్యారు. పాత రోజులు మళ్లీ వచ్చాయంటూ రైతులు అక్కడ మాట్లాడు కోవడం కనిపించింది. వ్యవసాయ శాఖ అధికారులు ఆగ్రోస్ కేంద్రం వద్ద ఉండి సీరియల్ ప్రకారం రైతులకు జీలుగ, జనుము విత్తనాలను అందజేశారు. మెదక్ జిల్లా కొత్తపల్లి రైతు వేదిక సహకార సంఘం వద్ద మంగళవారం జీలుగ విత్తనాల కోసం రైతులు పట్టాదారు పాస్ పుస్తకాలతో పడిగాపులు కాశారు. మండలంలో సుమారు 28 వేల ఎకరాల సాగు భూమి ఉంది. ఈ ఏడాది 650 క్వింటాళ్లు మండల అవసరాల నిమిత్తం అవసరమని మండల వ్యవసాయ అధికారి కృష్ణ జిల్లా అధికారులకు నివేదిక పంపించారు. పాపన్నపేటలోని ఆగ్రో సెంటర్‌కు 150 క్వింటాళ్లు ,కొత్తపల్లి రైతు సేవా సహకార సంఘానికి 223 క్వింటాళ్లు సరఫరా చేశారు. జీలుగ బస్తా ధర రూ.2790 ఉండగా, సబ్సిడీపై రూ.1116కు రైతులకు విక్రయిస్తున్నారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచే రైతులు పాపన్నపేటలోని ఆగ్రోస్ సర్వీస్ సెంటర్‌కు, కొత్తపల్లి సొసైటీ వద్దకు చేరుకున్నారు.కొత్తపల్లిలో రైతులు ఎక్కువగా ఉండడం, ఎండలు తీవ్రంగా ఉండటంతో రైతులు క్యూలో నిలబడలేక తమ వెంట తెచ్చుకున్న పాసు పుస్తకాలను లైన్లో ఉంచి గంటల తరబడి జీలుగ కోసం నిరీక్షించారు. చివరికి మధ్యాహ్నం విత్తనాలు పంపిణీ చేశారు. తగినన్ని విత్తనాలు దొరక్క పోవడంతో రైతులు నిరాశతో వెనుదిరిగారు. ఈ విషయంపై ఏఈ నాగకృష్ణను వివరణ కోరగా.. మండలానికి 380 క్వింటాళ్ల జీలుగ సరఫరా అయిందని తెలిపారు.