టేక్మాల్, మే 22: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో పాటు తరుగు పేరిట దోచుకుంటున్నారని మెదక్ జిల్లా బీఆర్ఎస్ టేక్మాల్ మండల అధ్యక్షుడు భక్తుల వీరప్ప అన్నారు. శుక్రవారం టేక్మాల్‌లోని జయశంకర్‌సార్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధ్యక్షుడు మాట్లాడుతూ.. మండలంలో అన్ని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్ల తీవ్ర ఆలస్యం జరుగుతున్నట్లు తెలిపారు.
తరుగు పేరిట సంచికి 2.5 కిలోలు అదనంగా తూకం వేస్తుంటే, కొన్ని రైస్ మిల్లులు అదనంగా మరో రెండు కిలోలు తరుగు తీసి రైతుల కష్టాన్ని దోచుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నా విషయం తెలుసుకున్న తహసీల్దార్ తులసీరాం అక్కడికి చేరుకున్నారు. రైస్‌మిల్లు లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో మాట్లాడి తరుగు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఆందోళనలో మాజీ ఎంపీటీసీలు సిద్దయ్య, మోహన్, నాయకులు, రైతులు రమేశ్ నాయక్, కిషన్, మాణిక్యం, సురేశ్, యాదయ్య, రాజేందర్, లింగం, బాలు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.