టేక్మాల్, జూన్ 1 : కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ప్రభుత్వం జాప్యం చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా టేక్మాల్ రహదారిపై వరి ధాన్యం బస్తా రోడ్డుపై వేసి తగలబెట్టారు. అనంతరం బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడారు. సకాలంలో తూకం వేయక, తూకం వేసిన ధాన్యాన్ని మిల్లర్లు తరలించకపోవడంతో అకాల వర్షానికి ధాన్యం తడిపోయిందన్నారు.
మిల్లుకు తరలించిన ధాన్యంలో తరుగు పేరిట అదనంగా కోత విధించడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పి ధర్నా విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు కిషన్, లింగం, సత్యం, ఆంజనేయులు, ఎల్లయ్య, రాములు, రమేశ్, లక్ష్మణ్, శోభన్ పాల్గొన్నారు.