చిన్నశంకరంపేట, నవంబర్ 4: మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ స్వగ్రామమైన కొర్విపల్లిలో అన్నదాతలు రోడ్డెక్కారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మం డల కొర్విపల్లిలో మెదక్ చేగుంట ప్రధాన రహదారిపై ధాన్యాన్ని పోసి రాస్తారోకో నిర్వహించారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 20 రోజులు దాటినా ప్రభుత్వం ధాన్యాన్ని ఎందుకు కొనుగోలు చేయడం లేదని రైతులు ప్రశ్నించారు. అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం మొలకలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న చిన్నశంకరంపేట ఎస్సై నారాయణ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులను సముదాయించి రాస్తారోకోను విరమింపజేశారు.