సిర్గాపూర్, ఆగస్టు 31: త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని రైతులు కన్నెర్ర చేశారు. నిరంతరం 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం కడ్పల్ గ్రామానికి చెందిన రైతులు విద్యుత్ కోతలు, సరఫరాలో అంతరాయంపై అసహనం వ్యక్తం చేస్తూ ధర్నాకు చేశారు. అనంతరం కడ్పల్ సబ్స్టేషన్ ముట్టడించి ఆందోళనకు దిగారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ త్రీ ఫేజ్ విద్యుత్ ఇవ్వకపోవడంతో పంట పొలాలకు నీరు పారబెట్టడం ఇబ్బందిగా మారిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో 24 గంటలు విద్యుత్ సరఫరా చేశారని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 14 గంటలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజుల నుంచి 8 గంటలు కూడా సరఫరా చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రీ ఫేజ్ లేక ఒక వైపు వ్యవసాయం బోరు, బావులకు, మరో వైపు గ్రామంలోని తాగు నీటి సరఫరా లేక ఇబ్బందులు తప్పడం లేదన్నారు.
త్రీ ఫేజ్ కరెంట్ మధ్యరాత్రి ఒంటి గంటకు ఇస్తే బావులకాడికి వెళ్లి నీరెలా పారించుకోవాలని స్థానిక సిబ్బందిని ప్రశ్నించారు. చీకటిలో విష పురుగులు ఉంటాయని, ఆ సమయంలో కరెంటు షాక్ తగిలి చనిపోతే దిక్కు ఎవరని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం రైతులు హన్మంత్రెడ్డి, రాజమల్లయ్య తదితరులు ఖేడ్ ఏడీఈతో ఫోన్లో మాట్లాడగా ఇక నుంచి రాత్రి 9 గంటలకు త్రీ ఫేజ్ అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రైతు నాయకులు హన్మంత్రెడ్డి, మల్లయ్య, మల్లేశం, రఘరాంరెడ్డి, రహీంసాబ్, పెంటారెడ్డి, రవి, పాండు, దుర్గయ్య, సంగ్రాంనాయక్ పాల్గొన్నారు.