సిద్దిపేట, అక్టోబర్ 19(నమస్తే తెలంగాణప్రతినిధి): రైతులకు ఇన్ని రోజులు ఊరించి..వానకాలం పంటకు రైతుభరోసా లేదని కాంగ్రెస్ ప్రభుత్వం చావుకబురు చల్లగా చెప్పింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రకటనపై రైతులు భగ్గుమంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చి తప్పిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుబంధు (రైతుభరోసా) రెట్టింపు చేసి ఇస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ హామీఇచ్చింది. తీరా ఓట్లుపడి అధికారంలోకి వచ్చాక రైతులకు మొండిచేయి చూపింది.సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో శనివారం రైతులు ఎక్కడికక్కడ తమ నిరసనలు తెలియజేశారు.
పలుచోట్ల సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. కాగా, ఎన్నికల ముందు మాట ఇచ్చి తప్పిని కాంగ్రెస్ సర్కార్ తీరును ఎండగట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ శ్రేణులు, రైతులకు పిలుపునిచ్చారు.ఆదివారం అన్ని మండలకేంద్రాల్లో రైతులు,బీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. రైతుభరోసా, రుణమాఫీ పూర్తి చేసేవరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విడిచిపెట్టేది లేదని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు చేయూత లభించడం లేదు. సగం మంది రైతులకు రుణమాఫీ కాలేదు.
వానకాలం రైతుబంధు (రైతభరోసా) ఇవ్వలేదు. కరెంటు, సాగునీటి కష్టాలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండేండ్లు కరోనా తో ఆర్థిక పరిస్థితి దిగజారినా రైతులకు అప్పట్లో సీఎం కేసీఆర్ రైతుబంధు ఇచ్చి ఆదుకున్నారని రైతులు గుర్తుచేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉమ్మడి మెదక్ జిల్లాలో 11 విడతల్లో రూ.8,771 కోట్ల రైతుబంధు రైతుల ఖాతాల్లో జమచేసింది.
ఆ డబ్బులు పంట పెట్టుబడికి రైతులకు ఎంతగానో అక్కరకు వచ్చా యి. కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు ప్రారంభించి నాటి నుంచి గతేడాది వానకాలం వరకు(11వ విడతల్లో) సిద్దిపేట జిల్లాలో 29,33,494 మంది రైతులకు రూ. 3,124.82 కోట్లు, మెదక్ జిల్లాలో 24,69,637 రైతులకు రూ.2,027.37 కోట్లు, సంగారెడ్డి జిల్లాలో 31, 95,960 మంది రైతులకు రూ.3,619.54 కోట్లు, మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లా లో 85,99,091 మంది రైతులకు బీఆర్ఎస్ ప్రభు త్వం రూ.8,771.73 కోట్లు రైతుబంధు అందించి రైతులకు దన్నుగా నిలిచింది.
చిన్నకోడూర్, నవంబర్ 19: రైతుభరోసా ఇవ్వకుండా రైతులను మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణ శర్మ విమర్శించారు. రైతు రుణమాఫీ చేయాలని, రైతు భరో సా ఇవ్వాలని శనివారం చిన్నకోడూరులో రైతులు ధర్నా చేసి సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు ధర్నాలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వేలేటి రాధాకృష్ణ శర్మ మాట్లాడుతూ.. సగం మందికే రుణమాఫీ చేసి కాంగ్రెస్ రైతులను మోసం చేసిందన్నారు. ఇప్పుడు రైతుభరోసా ఇవ్వకుండా మరోసారి మోసం చేసిందన్నారు. రైతు భరోసాపై కాలయాపనకే సబ్ కమిటీ వేశారన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్, పోచబోయిన శ్రీహరి యాదవ్, కీసర పాప య్య, మేడి కాయల వెంకటేశం, ఉమేశ్‌చంద్ర, జంగిటి శ్రీనివాస్ గుండెల్లి వేణు, గుజ్జరాజు, కొండం రవీందర్ రెడ్డి, ముసర్ల మధుసూదన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, రఘు రైతులు పాల్గొన్నారు.
గజ్వేల్, అక్టోబర్ 19: లెక్కకు మించి హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ప్రభుత్వం ప్రజా సమస్యలు గాలిలోకి వదిలేసి రాక్షసానందం పొందుతున్నదని, రైతులను నట్టేట ముంచిందని గజ్వేల్ ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, ఎంపీటీసీ ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ దేవీ రవీందర్ విమర్శిచారు. రైతుభరోసాపై మంత్రి తుమ్మల వ్యాఖ్యలకు నిరసనగా శనివారం గజ్వేల్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతు పక్షపాతిగా ఉంటామని చెప్పి, అధికారంలోకి రాగానే కాంగ్రెస్ సర్కారు అన్నింటిని విస్మరించి అన్నివర్గాలను ఇబ్బందులకు గురిచేస్తున్నదన్నారు.
కాంగ్రెస్ అసమర్ధ పాలనతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందని, హైడ్రాతో పేదల ఇండ్లు కూల్చడం రోడ్డున పడేస్తున్నారని విమర్శించారు. పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రశ్నించే గొంతుకలను నొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. గజ్వేల్‌లో సీఎం దిష్టిబొమ్మ దహనాన్ని చేపడుతున్న బీఆర్ఎస్ శ్రేణులు పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. కార్యక్రమంలో బెండే మధు, వెంకటేశంగౌడ్, జకీయొద్దీన్, మల్లేశం, బొల్లారం ఎల్లయ్య, కృష్ణాగౌడ్, మద్దూరి శ్రీనివాస్‌రెడ్డి, దయాకర్‌రెడ్డి, గుంటుక రాజు, రమేశ్‌గౌడ్, చందు, సంతోష్‌రెడ్డి, కల్యాణ్కర్ శ్రీనివాస్, రఘుపతిరెడ్డి, హన్మంతరెడ్డి, మురళి, బాల్‌రాజు, దశరథ్, అమరేందర్ తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి, అక్టోబరు 19: అనేక హామీ లు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభు త్వం అన్నివర్గాలను మోసం చేసింద ని, వానకాలం రైతు భరోసా ఇవ్వమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రకటించడం సిగ్గుచేటని సం గారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నా రు. శుక్రవారం సంగారెడ్డిలోని ఎమ్మె ల్యే క్యాంపు కార్యాయంలో మీడియా తో ఆయన మాట్లాడారు.ఆరు గ్యారెంటీల్లో ఒక్క ఉచిత బస్సు ప్రయాణం మినహా ఏ ఒక్కటి అమలు చేయడం లేదని విమర్శించారు.
రైతు భరోసా ఎకరాకు రూ.15వేలు ఇస్తామని ఇప్పటికీ ఇవ్వకుండా సర్కారు రైతులకు మొండిచేయి చూపిందని విమర్శించారు. సగం మందికే రుణమాఫీ చేసి అన్నదాతలను తీవ్రంగా ముంచిన ప్ర భుత్వం కాంగ్రెస్‌ది అని ఆయన విమర్శించారు. కేసీఆర్ రైతులకు చేయూతనిస్తే, రేవంత్ రైతులను దగా కు గురిచేస్తున్నాడని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ విమర్శించారు. పల్లె నుంచి హైదరాబాద్ వరకు కాంగ్రెస్ సర్కారులో ప్రజ లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
రైతులను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ సర్కారుకు రైతుల ఊసురు తగులుతుంది. రైతు భరోసా ఇస్తామని ప్రకటించి కాలయాపన చేసింది కాం గ్రెస్ సర్కారు. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు రైతులకు వానకాలం రైతు భరోసా లేనట్టే అని ప్రకటించడం సిగ్గుచేటు. రైతులను ఇబ్బందులు చేసిన రేవంత్ సర్కారుకు ఎదురుదెబ్బ తగలడం ఖాయం. రైతు ఏడ్చిన రాజ్యం.. ఎద్దు ఏడ్చిన ఎవుసం బాగుపడదు. రైతుల ఆవేదనను రాక్షసానందం పొందుతున్న కాంగ్రెస్ సర్కారుకు రైతాం గం ఉసురు తగిలి కొట్టుకుపోతుంది.
– యంజాల సంజీవరెడ్డి, రైతు, అన్నారం, గుమ్మడిదల మండలం, సంగారెడ్డి జిల్లా
కాంగ్రెస్ సర్కారు రైతుల కడుపు కొడుతోంది. రైతుబంధు ఇవ్వకుండా రైతులను ఆగంజేస్తున్నది. మొన్నటి వరకు ఇగ వేస్తాం..అగ వేస్తాం అని రైతులకు నమ్మించారు. ఇప్పడు వానకాలం లో రైతుబంధు ఇవ్వమని రైతులకు ఎగనామం పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల ఆగం చేసే ప్రభుత్వమని రుజువు చేసింది. మా రైతుల ఉసురు సర్కారుకు తగులుతుంది.
-పల్లె నర్సింహులు, రైతు, ఖాదిరాబాద్, సంగారెడ్డి జిల్లా
ఎన్నికలకు ముందు రైతులకు ఇది చేస్తం, అది చేస్తం అని మాయమాటలు చెప్పిండ్రు. అధికారంలోకి వచ్చినంక కాంగ్రెసోళ్లు రైతులను నట్టేట ముంచుతుండ్రు. కేసీఆర్ ఉన్నప్పుడు క్రమం తప్పకుండా రైతుబంధు అచ్చింది. రైతుబంధు డబ్బులు పెట్టుబడికి వాడుకున్నం. ఇప్పుడు పెట్టుబడి కోసం మునుపటి లెక్కనే వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు చేయాల్సి వస్తున్నది. రైతులతో పెట్టుకున్నోళ్లు ఎవలు బతికి బట్ట కట్టలే. రేవంత్ సర్కార్‌కు రైతుల ఉసురు తగిలి కొట్టుకు పోవడం ఖాయం.
-గోలిపల్లి నర్సిరెడ్డి, రైతు, నర్సాయపల్లి, సిద్దిపేట జిల్లా
సర్కారు ఎవుసం పెట్టుబ డి ఇయ్యకుంటే రైతులకు ఎవ్వలు సాయంసెయ్యా లే. కేసీఆర్ ఉన్నప్పుడు రెండుమాట్ల రైతులకు పె ట్టుబడి దున్నులు చాలు కాకముందే ఇచ్చేటోడు. ఇప్పుడు వానకాలం పో యింది. యాసంగి వస్తున్నా పెట్టుబడి ఇత్తమని అంటలేరు. మరి సన్న, చిన్నకారు రైతులుకు రైతుబంధు ఇస్తనే సాయం చేసినట్టు అయితది. మరి ఈ సర్కారు కూడా కేసీఆర్ లెక్కనే ఇయ్యాలే. ఇయ్యకుంటే రైతులు ఎం చేయ్యాలనో చేసి చూపిస్తరు.
– కాశబోయిన సంపత్, రైతు, హుస్నాబాద్
రైతుల గురించి ఒక్కో మం త్రి ఒక్కో తీరుగా మా ట్లాడుతున్నరు. ముందుగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసిన వెంటనే రైతు భరోసా ఇస్తామన్న రు. ఇప్పుడు వర్షాకాలం పంటల సీజన్ అయిపోతున్నది. ఇంతవరకు రైతు భరోసా పైసలు వేయలేదు. సగం మంది రైతులకు రుణమాఫీ కాలేదు. ఒక్కరికీ రైతు భరోసా ఇచ్చింది లేదు. కేవలం మాటలతోనే కాలం వెళ్లదీస్తున్నరు. ఇంత పనికి మాలిక ప్రభుత్వం దేశంలో మరెక్కడా ఉండదు. రైతులకు ప్రభుత్వం మీద నమ్మకం పోయింది.
– నారాయణరెడ్డి, రైతు, దిగ్వాల్, సంగారెడ్డి జిల్లా
కరోనా అచ్చినప్పుడు కూ డా కేసీఆర్ రైతులకు రైతుబంధు ఇచ్చిండు. కేసీఆర్ ఉన్నప్పుడే రైతులకు మం చిగుండే. కాంగ్రెస్ ప్రభు త్వం రైతులకు అన్యాయం చేస్తున్నది. రైతు భరోసా పైసలను ఈ సీజన్‌కు జమ చేయమని మంత్రి ప్రకటించడం బాధేసింది. కాంగ్రెస్ సర్కారు గిట్లనే పాలన జేస్తంటే రైతులు గట్టిగానే బుద్ధి చెబుతారు.
-బిజ్జ సంపత్, రైతు, నందిగామ, మెదక్ జిల్లా