సిద్దిపేట, ఏప్రిల్ 30(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ధాన్యం అమ్ముకోవడానికి రైతులు అరిగోస పడుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో నత్తనడకన ధాన్యం సేకరణ జరుగుతున్నది. కొన్ని ప్రాంతాల్లో దొడ్డు వడ్లకు మిల్లుల అలాట్మెంట్ ఇంకా కాలేదు. మిల్లులు అలాట్మెంట్ కాలేదని చాలాచోట్ల సన్న వడ్ల కాంటా కావడం లేదు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో యాసంగి ధాన్యం సేకరణలో ఆలస్యం జరుగుతుండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం సిద్దిపేట జిల్లాలో 419, మెదక్ జిల్లాలో 480, సంగారెడ్డి జిల్లాలో 238 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఉమ్మడి మెదక్ జిల్లాలో కనీసం 20శాతం వడ్లు రైతుల నుంచి కొనుగోలు చేయలేదు.
కేంద్రాలకు ధాన్యం తెచ్చి వారం పదిరోజులు అవుతున్నా కాంటా చేయకపోవడంతో రైతులు రోడ్డెక్కుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించడం లేదని, ఫోన్లు చేస్తే లిప్ట్ చేయడం లేదని, దురుసుగా సమాధానం ఇస్తున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు.ఒక్కో రైతు పదిహేను రోజులు కొనుగోలు కేంద్రం వద్దనే పడిగాపు కాస్తున్నాడు. ధాన్యం కాంటా అయి పది రోజులైనా రైతులకు డబ్బులు పడడం లేదు. ఏ సెంటర్లో చూసి నా పాత గన్నీ బ్యాగులు, చినిగిపోయిన గన్నీ బ్యాగులు కనిపిస్తున్నాయి. వాటిలో వడ్లు నింపగానే ఖాళీ అవుతున్నాయి.
చినిగిపోయిన గన్నీ బ్యాగులు ప్రభుత్వం పంపడంతో రైతుల వాటిని రైతులు కుట్లు వేసి ధాన్యం నింపుతున్నా రు. ఒక్కో సంచి నుంచి ధాన్యం పోవడంతో తరుగు పేరిట కోతలు విధిస్తున్నారు. కేంద్రాల్లో సరిపడా ప్యాడీ క్లీనర్లు లేవు. దీంతో రైతులు అద్దెకు తూర్పార పట్లే యంత్రాలను తీసుకువచ్చి వడ్లు తూర్పార పడుతున్నారు. ఒక్క ట్రాక్టర్ తూర్పార పడితే రూ.400 నుంచి రూ.500 వరకు రైతుపై భారం పడుతున్నది. తూర్పార పట్టి మిషన్ సంచులు నింపే దానికి ఒక ట్రాక్టర్ ట్రిప్ వడ్లకు రూ. 800 తీసుకుంటున్నారు ప్రభుత్వ ప్యాడీ క్లీనర్లు పనిచేయక పోవడంతో రైతులకు అదనపు భారం పడుతున్నది.
టార్పాలిన్ కవర్లు కూడా ఇవ్వడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని సెంటర్లకు కవర్లు అందించింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం టార్పాలిన్ కవర్లు అందివ్వక పోవడంతో అకాల వర్షాలకు వడ్లు తడిసి ముద్దవుతున్నాయి. వర్షానికి తడిసిన ధాన్యం ప్రభు త్వం కొనుగోలు చేయడం లేదు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలో రైతులకు అన్నీ సమస్యలే ఉన్నాయి. కేంద్రాల నిర్వహణ చూసే వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇటీవల నంగునూ రు మార్కెట్ యార్డులో వడ్లు తీసుకపోయిన రైతుల మీదికి అక్కడి క్షేత్రస్థాయి అధికారి దురుసుగా మాట్లాడారని రైతులు ఫిర్యాదు చేశారు. చాలా కేంద్రాల్లో రైతులకు టోకెన్ ఇవ్వడంలోనూ రాజకీయాలు చేస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు.
వరుస పద్ధ్దతి కాకుండా ఇష్టానుసారంగా టోకెన్లు విడుదల చేస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. అసలే ఈ యాసంగిలో వరి పంట సరిగ్గా దిగుబడి రాక రైతులు దిగులుతో ఉన్నారు. పంట దూసపోయి రోగం వచ్చి దిగుబడిపై ప్రభావం చూపింది. ఎక్కువగా తాలు పోతున్నదని రైతులు చెబుతున్నారు. మిట్టపల్లికి చెందిన రైతు రెండెకరాల్లో నాటువేస్తే కేవలం రెండు ట్రాక్లర్ల వడ్లు మాత్రమే వచ్చాయి. పంటంతా దూసపోయి దిగుబడి రాలేదు, ధాన్యం కొనుగోలు తీసుకువస్తే సెంటర్లో పది రోజలుగా పడిగాపులు కాయాల్సి వస్తున్నదని రైతు వాపోయాడు.
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులే ఎదురవుతున్నాయి. ఎండలు విపరీతంగా ఉండడంతో కనీసం నీడను ఏర్పా టు చేయడం లేదు. తాగునీటి వసతి లేదు. చిరిగిన గన్నీ బ్యాగులు ఉన్నాయి. తూర్పార పట్టే యంత్రాలు సరిపడా లేక ఆలస్యం అవుతున్నది. సీరియల్ నెంబర్ వచ్చే వరకు మూడు రోజులు, కాంటా అయి ధాన్యం లారీలో లోడ్ అయ్యే వరకు మరో ఐదు రోజలవుతున్నది. మొత్తంగా కేంద్రం వద్ద రైతులు 10 నుంచి 15 రోజులు పడిగాపులు కాయాల్సి వస్తున్నది. ధాన్యం అమ్ముకున్న రైతుకు పది రోజలు దాటినా పైసలు రావడం లేదు.
బీఆర్ఎస్ హయాం లో 72 గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అయ్యాయి. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని రైతులు తెలుపుతున్నారు. దళారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కుమ్మక్కై రైతులకు నష్టం చేకూరుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అకాల వర్షాలు, సర్కారు కేంద్రాలు ఓపెన్ కాక పోవడంతో ఇప్పటికే చాలామంది రైతులు తక్కువ ధరకు వ్యాపారులకు ధాన్యం అమ్ముకున్నారు. తాము కొన్న ధాన్యాన్ని వ్యాపారులు ప్రస్తుతం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతుల పేరున విక్రయించి మద్దతు ధర పొందుతున్నట్లు తెలిసింది. దీనికి కేంద్రాల నిర్వాహకులతో దళారులు ఒప్పందం చేసుకుని దందా సాగిస్తున్నట్లు తెలిసింది. దళారులు తెచ్చిన ధాన్యం గుట్టుచప్పుడు కాకుండా కాంటా చేయించి లారీల్లో లోడ్ చేయించి నిర్వాహకులు పంపుతున్నారు.
ఒక్కో క్వింటాల్‌కు రూ. 400 నుంచి రూ. 500 వరకు లాభం పొందుతున్నారు.ఇలా వచ్చిన డబ్బులో నిర్వాహకులకు కొంత మేర దళారులు అప్పజెప్పుతున్నారు. యాసంగిలో వరి పంట సరిగా రాలేదని రైతులు చెబుతున్నారు. పంట దూస (ఊస)పోయి చాలావరకు తరుగు పోతున్నది. వరి పొట్ట దశలోనే ఈ మాయ రోగం అందుకుంది. ఎప్పుడు కూడా ఇలా రాలేదని రైతులు చెబుతున్నారు. రెండు ఎకరాల పంట వేస్తే రెండు ట్రాక్టర్ల వడ్ల దిగుబడి కూడా రాలేదని వాపోతున్నారు. ఆయా కేంద్రాల వద్ద తాలు కుప్పలు, కుప్పలుగా పడి ఉంది. దీంతో రైతులు నష్టపోయారు.
నాకున్న రెండెకరాల పాటు మరో రెండు ఎకరాల భూమి కౌలుకు తీసుకొని వరిసాగు చేశాను. నీళ్ల గోసతో అంతంతా మాత్రం పొలం పారింది. ఎండేకాడికి ఎండి పోయింది. మిగతా వరి కోసం వడ్లను కొనుగోలు కేంద్రానికి తెచ్చిన. వడ్లు ఎండబెట్టి, తూర్పార పట్టి, సంచుల కోసం తిరుగుడు, అటు ఇటు అనేసరికి వారం రోజుల సమయం పట్టింది. తీరా వడ్లు అమ్మినా వారం దాటినా డబ్బులు ఖాతాలో జమకాలేదు. అడిగితే రేపు, మాపు పడుతాయ్ అంటున్నారు. గతంలో వడ్లు అమ్మిన వెంటనే ఒకటి, రెండు రోజుల్లో ఖాతాలో పైసలు పడ్డాయ్.
-భూక్య జగన్, రైతు, బోదర్వాగు తండా(అక్కన్నపేట)