సిద్దిపేట, ఆగస్టు 24: ప్రభుత్వం సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఆదివారం యూరియా కోసం సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్ వద్ద కర్షకులు సిద్దిపేట -కామారెడ్డి రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ యూరియా కోసం రోజుల తరబడి క్యూలో ఉన్నా ఇవ్వడం లేద ని వాపోయారు. వెంటనే సరిపడా యూరి యా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
కొమురవెల్లి, ఆగస్టు 24 : సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలోని ఆగ్రోస్ కేంద్రంలో యూరియా బస్తాలు విక్రయిస్తున్నారనే విష యం తెలుసుకున్న ఆయా గ్రామాల నుంచి రైతులు భారీగా చేరుకున్నారు. రైతు వేదిక వద్ద చేర్యాల ఎస్సై నవీన్, సిబ్బంది రైతులకు టోకెన్లు ఇచ్చారు. ఆగ్రోస్ కేంద్రం వద్ద కొమురవెల్లి ఎస్సై రాజు, సిబ్బంది పహారాలో రైతులకు యూరియా బస్తాలు విక్రయించారు. ఎకరం ఉన్న రైతులకు ఒక యూరియా బస్తా, రెండు ఎకరాలు ఉన్న రైతులకు రెండు యూరియా బస్తాలు ఇచ్చారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో యూరియా బస్తాలు గడపముందుకే వచ్చేవని, ఇదేం చోద్యం అంటూ రైతులు ముక్కున వేలుసుకున్నారు.
నంగునూరు, ఆగస్టు 24 : సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని పాలమాకుల పీఏసీఎస్, రైతు వేదికల వద్ద యూరియా కోసం ఆదివారం రైతులు భారీ క్యూ కట్టారు. ఒకరిపై ఒకరు తోసుకుంటూ రైతులు యూరి యా కోసం ఇబ్బందులకు గురయ్యారు. ఒక వైపు చెప్పుల క్యూ ఏర్పాటు చేయడంతో పాటు బండలపై పేర్లు రాసి లైన్లో ఉంచిన దృశ్యాలు కనిపించాయి. చిన్నపిల్లలను పట్టుకొని మహిళా రైతులు, తల్లిదండ్రులు యూరియా కోసం ఉదయం మూడు గంటల నుంచి పడిగాపులు కాశారు. రైతులు సీఎం డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీస్ పహారాలో యూరియా పంపిణీ చేసినా చాలా మందికి అందక నిరాశతో వెనుదిరిగారు.
శివ్వంపేట, ఆగస్టు 24 : రైతులకు యూరి యా అందించడంలోకాంగ్రెస్ సర్కారు పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ధ్వజమెత్తారు. మెదక్ జిల్లా శివ్వంపేటలో ఆదివారం యూరియా కోసం క్యూలో ఇటుకలు, చెప్పులు పెట్టి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న ఆమె అక్కడికి చేరుకొని మాట్లాడారు. నర్సాపూర్-తూప్రాన్ ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మార్పు రావాలి అంటూ ప్రచారం చేసి తీరా పాతరోజులను గుర్తుకుతెచ్చిందన్నారు.
అప్పులు చేసి నాట్లు వేసుకుంటే యూరియా లేక పనులన్నీ మానుకొని రోడ్డు ఎక్కాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఒక రైతుకు ఒక యూరియా బస్తా ఇస్తే పంట దిగుబడి ఏవిధంగా వస్తుందన్నారు. రైతులు అవస్థలు పడుతున్నా తాగునీరు సైతం ఇచ్చేవారు లేరన్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతులకు సరైన సమయానికి ఎరువులు, యూరియా అందించినట్లు గుర్తుచేశారు. ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక లేక కేంద్రం మీద నెట్టివేయడం.. బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టివేయడం పరిపాటిగా మారిందని విమర్శించారు. ఈ విష యం తెలుసుకున్న పోలీసులు, ఎస్సై మధుకర్‌రెడ్డి తన సిబ్బందితో కలిసి రాస్తారోకోను విరమింపజేశారు.
అంతకుముందు ఎమ్మెల్యే అధికారులతో ఫోన్లో మాట్లాడి రేపు మరో రెండు లారీల యూరియా అందించాలని, లేనిపక్షంలో రైతుల పక్షాన బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్, గ్రంథాలయ సంస్థ మెదక్ జిల్లా మాజీ చైర్మన్ చంద్రాగౌడ్, మాజీ ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, మాజీ జడ్పీటీసీ పబ్బ మహేశ్‌గుప్తా, జడ్పీ కోఆప్షన్ మాజీ సభ్యుడు మన్సూర్, మాజీ వైస్ ఎంపీపీ రమాకాంత్‌రెడ్డి, సీనియర్ నాయకులు యాదాగౌడ్, పత్రాల శ్రీనివాస్‌గౌడ్, రాజశేఖర్‌గౌడ్, కల్లూరి వెంకటేశ్, రవినాయక్, లక్ష్మీనర్సయ్య, కొండల్ పాల్గొన్నారు.