తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా పనిచేస్తున్న ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక, ప్రతినిత్యం ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఎరువులు, విత్తనాలు, పంట ఉత్పత్తుల కొనుగోళ్లు, బోనస్, కరెంట్ సమస్యలు, రైతుభరోసా, పంట రుణమాఫీ, పంటనష్ట పరిహారం, నకిలీ విత్తనాల బెడద రైతులను పట్టిపీడిస్తున్నది. భారీవర్షాలకు పంటలు దెబ్బతిని అపార నష్టం జరిగింది. గడిచిన వానకాలం పెద్ద ఎత్తున పంటలు దెబ్బతిని రైతులు ఆర్థికంగా చితికిపోయారు. అన్నదాతలకు ప్రభుత్వ చేయూత కరువై కన్నీరు పెడుతున్నారు.
సాగునీటి కష్టాలు, కాల్వల దుస్థితి, ప్రాజెక్టుల పురోగతి కరువై రైతులు చింతిస్తున్నారు. పరిశ్రమలు, రోడ్ల కోసం ప్రభుత్వం భూసేకరణ చేపట్టి, సరైన పరిహారం ఇవ్వక పోవడంతో రైతులు అనేక ఆందోళనలు చేపట్టారు. వీటన్నింటి గురించి ఎప్పటికప్పుడు ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తెచ్చి, పాలకుల దృష్టికి తీసుకెళ్లి రైతులకు అండగా నిలిచింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో గడిచిన ఏడాది కాలంలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులపై ప్రచురితమైన కథనాల్లో మచ్చుకు కొన్ని ఇవి…
– నమస్తే తెలంగాణ నెట్వర్క్ ఉమ్మడి మెదక్ జిల్లా, డిసెంబర్ 27