రామాయంపేట, ఆగస్టు 22: యూరియా పక్కదారి పట్టించి రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించమని, వ్యాపారులు యూరియా బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే ఊరుకోమని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో లేని యూరియా తిప్పలు నేడు రైతులకు కాంగ్రెస్ పాలనలో దాపురించాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అరిగోస పెడుతున్నదని ఆమె మండిపడ్డారు. శుక్రవారం రామాయంపేటలో బీఆర్ఎస్ నాయకులు, రైతులతో కలిసి స్థానిక ఆగ్రోసేవా కేంద్రం, గ్రోమోర్ ఎరువుల దుకాణాల వద్దకు వెళ్లి వ్యాపారులను నిలదీశారు.
వ్యాపారులు అక్రమంగా దొంగచాటుగా యూరియా నిల్వలను దాచిపెట్టి బ్లాక్ మార్కెట్లో విక్రయాలు జరుపుతున్నారని మండిపడ్డారు.ఆగ్రోస్ రైతుసేవా కేంద్రానికి వెళ్లి బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న దుకాణాన్ని తెరిపించి యూరియా బస్తాలను పోలీసుల సమక్షంలోనే రైతులకు అందజేశారు.అక్కడే ఉన్న వ్యాపారి రమణపై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న రామాయంపేట సీఐ, ఎస్సైలు కల్పించుకుని పద్మాదేవేందర్‌రెడ్డిని సముదాయించారు.
అక్కడికి ఆగకుండా బీఆర్ఎస్ నేతలు, రైతులు కలిసి రైతుసేవా కేంద్రం, ఆగ్రోస్ వద్ద వ్యాపారులను నిలదీశారు. రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. రామాయంపేట పట్టణంలో బైక్ ర్యాలీ చేపట్టి కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలను ఎండగట్టారు. కావాలనే కాంగ్రెస్ నాయకులు యూరియా కొరతను సృష్టిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ దొందే దొందేనని విమర్శించారు. రైతులను అరిగోస పెడుతున్న ఈ రెండు పార్టీలకు వారి ఉసురు తగులక మానదని పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. రైతుసేవా కేంద్రంలో రైతులకు గంట మందు కొంటేనే యూరియా బస్తాలు ఇస్తామనడం ఎంత వరకు సమంజసమని వ్యాపారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పదిరోజుల నుంచి రైతులు యూరియా కోసం తిరుగుతున్నా కాంగ్రెస్ నాయకులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రెండు రోజుల్లో యూరియా ఇవ్వకపోతే రైతులతో కలిసి జాతీయ రహదారిపై రాస్తారోకో, ధర్నా చేపడుతామని పద్మాదేవేందర్‌రెడ్డి హెచ్చరించారు. ఆమె వెంట బీఆర్ఎస్ నాయకులు పల్లె జితేందర్‌గౌడ్, బాదె చంద్రం, సిద్ధ్దిరాంరెడ్డి, ఎస్కే హైమద్, కన్నపురం కృష్ణాగౌడ్, అస్నొద్దీన్, ఐలయ్య, పాతూరి సిద్దరాములు, రాజు యాదవ్, మైలరం శ్యాములు, రాజేందర్, డాకి శ్రీనువాస్, పాతూరి సాయికుమార్, ఉడుత సిద్దరాములు, బాలుగౌడ్, ఉమామహేశ్, సుభాశ్ రాథోడ్, నరేందర్‌రెడ్డి ఉన్నారు.