సిద్దిపేట, జూలై 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతులు మరోసారి రోడ్డెకుతున్నారు.వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టక ఉమ్మడి మెదక్ జిల్లాతోపాటు పరిసర ప్రాంతాల రైతుల్లో ఆందోళన నెలకొంది. దీంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని, వెంటనే ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసి అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్లు నింపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.రైతుల ఆందోళనకు మద్దతుగా సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ చిన్నకోడూరు మండలశాఖ ఆధ్వర్యంలో అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి రంగనాయకసాగర్ వరకు రైతులు ఆదివారం మహాపాదయాత్ర చేపట్టనున్నారు.
ఆదివారం(నేడు) ఉదయం 8గంటలకు అన్నపూర్ణ రిజర్వాయర్ బండ్ (అల్లిపూర్) నుంచి మహాపాదయాత్ర ప్రారంభం కానున్నది. 16 కిలోమీటర్ల మహాపాదయాత్రలో వేలాది మంది రైతులు, మహిళా రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు పాల్గొంటారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు రైతులకు సంఘీభావంగా పాదయాత్రలో పాల్గొననున్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా నీటి కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. రిజర్వాయర్లలో నీరు అందుబాటులో ఉంటే సాగుకు ఊతం లభిస్తుందని, లేకుంటే సాగు సంక్షోభం తప్పదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సాగు నీటికోసం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రాంత రైతులు ఇటీవల పెద్దఎత్తున ధర్నా చేపట్టారు. పాదయాత్రతో రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, ప్రభుత్వం వెంటనే స్పందించి సాగునీరు అందించే చర్యలు చేపట్టకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని బీఆర్ఎస్ శ్రేణులు హెచ్చరిస్తున్నారు.
సిద్దిపేట జిల్లా సాగు వివరాలిలా ఉన్నాయి. వరి పంట సాగు లక్ష్యం 3,33,202 ఎకరాలు కాగా, ఇప్పటి వరకు 38,500 ఎకరాల్లో సాగైంది. పత్తి పంట సాగు లక్ష్యం 1,41,691 ఎకరాలు కాగా, 1,01,109 ఎకరాలు, మొక్కజొన్న సాగు లక్ష్యం 28,939 ఎకరాలకు 20,804 ఎకరాల్లో సాగు చేశారు. కంది పంట సాగు లక్ష్యం 5,600 ఎకరాలు కాగా ,4,189 ఎకరాలు సాగైందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. కాళేశ్వరం కూలిపోయిందని సీఎం రేవంత్‌రెడ్డి అసత్య ప్రచారాలు చేసి ఎటె్లైతే అధికారంలోకి వచ్చిండో, ఆ కాళేశ్వరం ద్వారా నీళ్లు ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ కేసీఆర్‌ను అప్రతిష్టపాలు చేసి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నంలో భాగంగానే నీళ్లు ఎత్తిపోయటానికి ముందుకు రావడం లేదు.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తూ తెలంగాణ రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నది. మేడిగడ్డ వద్ద ప్రస్తుతం గోదావరి జలాలు 97- 98 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నాయి. కన్నెపల్లి పంపులు ప్రారంభించేందుకు కనీసం 93 మీటర్ల నీటి మట్టం ఉంటే సరిపోతుంది. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వం రోజుకు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసే అవకాశం
ఉన్నా వినియోగించడం లేదు.