Grain purchase centres | టేక్మాల్: టేక్మాల్ మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభించనున్నట్లు సొసైటీ ఛైర్ పర్సన్ యశ్వంత్ రెడ్డి తెలిపారు. టేక్మాల్ మండల కేంద్రమైన టేక్మాల్ లోని సహకార సంఘం గోదాం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడానికి అవసరమైన ఏర్పాట్లను సోమవారం చేశారు.
గోదాం పరిసర ప్రాంతాల్లో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి ప్థలాన్ని చదును చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల పరిధిలోని ధనూర, టేక్మాల్, పల్వంచ, కోరంపల్లి, బర్ధీపూర్, చంద్రుతాండ, ఎలకుర్తి, కాదులూర్ గ్రామాల్లో సొసైటీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. సొసైటీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు తమ వరి ధాన్యాన్ని అమ్ముకోవాలని, ప్రైవేటు వ్యక్తులకు విక్రయించి మోసపోవద్దన్నారు.
రైతుల శ్రేయస్సు, సంక్షేమం కోసం టేక్మాల్ సొసైటీ నిరంతరం పని చేస్తుందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లను చేస్తున్నట్లు తెలిపారు. టేక్మాల్ మండలంలో ఇంకా ఎక్కడైనా అవసరమైతే తప్పనిసరిగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడానికి సొసైటీ సిద్దంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డైరక్టర్లు కిషన్, శ్రీశైలం, పలువురు నాయకులు, రైతులు ఉన్నారు.