నిజాంపేట,ఆగస్టు7 : బీఆర్ఎస్ ప్రభుత్వం హాయంలో రైతులకు సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబా టులో ఉండేవి. రెండేండ్ల రేవంత్ రెడ్డి పాలనలో ఎరువుల కోసం అన్నదాతలు అరిగోస పడుతున్నారు. నాడు కేసీఆర్ ముందు చూపుతో రైతులకు ఎరువుల సమస్య లేకుండా చర్యలు తీసుకున్నారు. కాగా, వారం రోజుల నుంచి మెదక్ జిల్లా నిజాంపేట మండలవ్యాప్తంగా రైతులకు సరిపడా ఎరువులు లేవనే సమస్య వారిని భయపెడుతున్నది.
నిజాంపేటలోని పీఏసీఎస్ కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు పడ్డ పాట్లు అంతా ఇంతా కావు. కార్యాలయ గోదాంకు గురువారం యూరియా లారీ రాగా రైతులందరూ ఒక్కసారిగా గుమికూడారు. గంటల కొద్ది వేచి చూసిన ఒక్కొక్కరికి రెండు సంచుల యూరియా మాత్రమే ఇస్తూ….సరిపడా ఇవ్వడం లేదని రైతులు అసహనం వ్యక్తం చేశారు. సరిపడా ఎరువులను సమకూర్చాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.