చేగుంట, మే 10: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పదిహేను రోజుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడం లేదని, అకాల వర్షాని కి ధాన్యం తడిసి రైతులు నష్టపోతున్నారని, తక్షణమే ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా చేగుంట మండలం కర్నాల్‌పల్లిలో ఐకేపీ ధాన్యం కొను గోలు కేంద్రాన్ని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి ఆదివారం ఆయన పరిశీలించారు. లారీలు రాక కొనుగోలు కేంద్రా ల్లో ధాన్యం ఆరబెట్టగా వర్షానికి తడిసిందని పలువురు రైతులు ఆయన దృష్టికి తీసుకొచ్చి కంటతడిపెట్టారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే వడ్లు కొనాలని, లేదంటే రైతుల పక్షాన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు,నాయకులంతా కలెక్టరేట్లను ముట్టడిస్తారని హెచ్చరించారు.
కర్నాల్‌పల్లి కొనుగోలు కేంద్రం ప్రారంభించి 25రోజులైనా ఇప్పటి వరకు కేవలం రెండు లారీలు రావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ధాన్యం తడిసిపోయిందని,మళ్లీ రైతులు ఎండబెట్టి సిద్ధం చేసినప్పటికీ ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదన్నారు. ఇప్ప టి వరకు ఒక్కసారి కూడా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష చేశారా.. ఒక్క మంత్రి అయినా జిల్లాల్లో పర్యటించారా అని ప్రశ్నించారు. సీఎం రైతులను పూర్తిగా గాలికొదిలేశాడని, ఢిల్లీ పర్యటనలు,రాజకీయ కార్యక్రమాలకే పరిమితమయ్యారని విమర్శించారు. రైతులు కోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేద న్నారు. ఈ ప్రభుత్వానికి రైతులంటే లెక్కలేదు, పట్టింపులేదన్నారు. ఏసీ రూముల్లో కూర్చుని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అబద్ధాలు చెబుతున్నారన్నారు.
అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆపార్టీ సర్పంచులే వడ్లు కొనాలని కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేస్తున్నారంటే ప్రభుత్వ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. ప్రతిపక్ష నాయకులు సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తే కేసులు పెట్టి అరెస్టులు చేయడం దారుణమన్నారు. మక్కలు,శనగలు, పొద్దుతిరుగుడు అమ్మిన రైతులకు ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. జొన్నల కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభమే కాలేదని, 35రోజుల నుంచి పొద్దుతిరుగుడు కొనుగోళ్లు ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. చేగుంట మండలలోని 10గ్రామాల్లో వడగండ్ల వల్ల పంటలకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకుడు సోలిపేట సతీశ్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొమండ్ల నారాయణరెడ్డి, మైలరాం బాబు, సర్పంచ్ల ఫోరం మండలఅధ్యక్షుడు, బీఆర్ఎస్ జిల్లా నాయకులు రాజిరెడ్డి, సుభాష్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ బాణపురం కృష్ణారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీలు సుజాత, మల్లేశంగౌడ్, రాజ్‌గోపాల్, శ్రీనివాస్, అశోక్‌రెడ్డి, బాల్శివ, శ్రీకాంత్, సాయికుమార్, సుదర్శనం, అలీ, తహసీల్దార్ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.