నిజాంపేట, జూన్ 23: తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్‌రావు నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఆగ్రామ రూపురేఖలే మారాయి. భూగర్భజలాలు అడుగంటి రైతులు కూలీలుగా పట్టణాలకు వలస వెళ్లిన తరుణంలో కాళేశ్వరం ప్రాజెక్టు బతుకు తోవ చూపింది. రైతులు తిరిగి సొంత గ్రామానికి వచ్చి వ్యవసాయపనులు చేసుకుంటూ సంతోషంగా ఉన్నారు. మండుటెండల్లో చెరువులు,కుంటల మత్తళ్లు దుంకించిన ఘనత కేసీఆర్‌కే దక్కింది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో 19 వేల ఎకరాలకు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి కొండపోచమ్మసాగర్ నుంచి రామాయంపేట కెనాల్ ద్వారా కాళేశ్వరం జలాలను బచ్చురాజ్పల్లికి విడుదల చేశారు. గ్రామంలో ఉన్న బోలావాణి కుంట,దామర చెరువు నేటికీ నిండుకుండలా మారాయి. ఫలితంగా భూగర్భజలాలు పెరిగి స్థానికంగా ఉన్న రైతులు పంటలు సమృద్ధిగా పండించుకుంటున్నారు. కేసీఆర్ ముందుచూపుతోనే కాళేళ్వరం నీళ్లు గ్రామానికి వచ్చాయని, దానివల్లనే వలసలు తగ్గాయని, గ్రామ రూపురేఖలు మారామని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి హరీశ్‌రావు కొండపోచమ్మసాగర్ నుంచి నీటిని విడుదల చేశారు. కాళేళ్వరం నీళ్లతో ఇప్పటికీ బోలావణికుంట, దామరచెరువు నిండుగా ఉన్నాయి.సాగునీటికి ఎటువంటి కష్టం లేకుండా గ్రామంలో సుమారు 200 ఎకరాల మేర పంటలు పండించుకుంటున్నాం. కేసీఆర్ ముందుచూపుతో కాళేళ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల మా ప్రాంతానికి నీళ్లు వచ్చాయి.కేసీఆర్ సార్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం.
– సత్యం, రైతు, బచ్చురాజ్‌పల్లి, నిజాంపేట మండలం, మెదక్ జిల్లా
కాలంతో పనిలేకుండా కాళేళ్వరం నీళ్లతో వ్యవసాయం చేసుకుంటూ సంతోషంగా బతుకుతున్నాం. గ్రామంలోని దామరచెరువు కింద నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇప్పటికీ బోర్ల నుంచి సమృద్ధిగా నీళ్లు వస్తుండటంతో కాలంకోసం ఎదురుచూడకుండా పంటలు పండించుకుంటున్నాం. గతంలో సరిగ్గా నీళ్లు లేక పట్నం వలస వెళ్లి బతికినం. కేసీఆర్ కట్టించిన కాళేళ్వరం ప్రాజెక్టు వల్ల మా గ్రామానికి నీళ్లు వచ్చాయి. కేసీఆర్ సార్ మాకు తండ్రి లెక్క.ఆయన సీఎంగా ఉన్నా లేకున్నా చేసిన పనులను ఎప్పటికీ తెలంగాణ ప్రజలు మర్చిపోరు.
-కళ్ల స్వామి, రైతు, బచ్చురాజ్‌పల్లి, నిజాంపేట మండలం, మెదక్ జిల్లా