సంగారెడ్డి, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలోని జలవనరులు నీటితో కళకళలాడుతున్నాయి. ఆకుపచ్చని పంటలు, అలుగు పారుతున్న చెరువులు, పొంగిపొర్లుతున్న వాగులతో గ్రామాలు కనువిందు చేస్తున్నాయి. వర్షాలతో సంగారెడ్డి జిల్లాలోని సింగూరు, నల్లవాగు, నారింజ ప్రాజెక్టులు నిండుకుండలుగా మారాయి. వాగులు, వంకలు నిండుగా ప్రవహిస్తున్నాయి. చెరువులు అలుగు పారుతున్నాయి. భూగర్భజలమట్టాలు పైకి ఉబికి వచ్చాయి. జలాలు పుష్కలంగా ఉండటంతో వానకాలం సీజన్ గతేడాదితో పోలిస్తే పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. దీంతో గ్రామాల్లో రైతులు, కూలీలకు చేతినిండా ఉపాధి దొరుకుతున్నది. మరోవైపు హార్వెస్టర్లు, ట్రాక్టర్లు, లారీలకు డిమాండ్ పెరిగింది. వాహన యజమానులు రోజంతా కిరాయిలకు తిప్పుతూ ఆర్థికంగా లబ్ధిపొందుతున్నారు.
పెరిగిన పంటల సాగు.. కూలీలకు పెరిగిన ఉపాధి
వానకాలం సీజన్ రైతులకు కలిసొచ్చింది. సీజన్ ప్రారంభంలో వర్షాలు లేకపోవడంతో ఆశించిన స్థాయిలో పంటల సాగు జరుగుతుందా అని ఆందోళన చెందారు. ఆ తర్వాత వర్షాలు బాగా కురవడంతో జిల్లాలో సాధారణ విస్తీర్ణం కంటే అధికంగా పంటలు సాగయ్యాయి. జిల్లాలో ఈ వానకాలం సీజన్ 6.50 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. కాగా, రైతులు 7,16,764 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. గతేడాది వానకాలం సీజన్ 7,12,190 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ప్రధానంగా 3,57,482 ఎకరాల్లో పత్తి, 1,48,052 ఎకరాల్లో వరి, 78,910 ఎకరాల్లో కంది, 77,457 ఎకరాల్లో సోయాబీన్, 13,937 ఎకరాల్లో మొక్కజొన్న, 15,800 ఎకరాల్లో చెరుకు, 9,780 ఎకరాల్లో పెసర, 6,248 ఎకరాల్లో మినుము తదితర పంటలను రైతులు వేశారు. పంటల విస్తీర్ణం పెరగడంతో వ్యవసాయ కూలీలకు ఉపాధి పెరిగింది.
అలుగు పారుతున్న 334 చెరువులు
సంగారెడ్డి జిల్లాలో జలవనరులు నీటితో నిండుగా ఉన్నాయి. సింగూరు ప్రాజెక్టు పూర్తిగా నిండింది. ప్రాజెక్టు పూర్తి నీటినిల్వ సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 29.490 టీఎంసీ జలాలు ఉన్నాయి. ప్రాజెక్టు నిండుగా ఉండటంతో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. సింగూరు ప్రాజెక్టు దిగువకు నీటిని వదులుతున్నారు. నల్లవాగు, నారింజ ప్రాజెక్టులు పూర్తిగా నిండాయి. జిల్లాలో మొత్తం 1374 చెరువులు ఉండగా, 334 చెరువులు అలుగు పారుతున్నాయి. 512 చెరువులు నీటితో నిండుగా ఉన్నాయి. 385 చెరువులు 75 శాతం నిండాయి.
భూగర్బజలాలు పైపైకి..
వర్షాలతో సంగారెడ్డి జిల్లాలో భూగర్భజలమట్టాలు పెరుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో సాధారణ భూగర్భజలమట్టం 9.34 మీటర్ల మేరకు చేరుకున్నది. గతనెలలో భూగర్భజలాలు 10.41 మీటర్ల లోతులో ఉండగా, ప్రస్తుతం 1.07 మీటర్ల మేర పైకి వచ్చాయి. వట్ మండలంలో అత్యంత పైకి 1.90 మీటర్లలో జలాలు ఉండగా, హత్నూర మండలంలో అత్యంత లోతులో 18.32 మీటర్లలో భూగర్భ జలాలున్నాయి. అమీన్ పుల్కల్, రాయికోడ్, నాగల్ మండలాల్లో రెండు నుంచి నాలుగు మీటర్ల లోతులో భూగర్భజలాలున్నాయి. అందోలు, మనూరు, మొగుడంపల్లి, ఝరాసంగం, మునిపల్లి, న్యాల్ సిర్గాపూర్, జిన్నారం మండలాల్లో 5 నుంచి 8 మీటర్లలోతులో భూగర్భ జలమట్టాలు ఉన్నాయి. మిగితా మండలాల్లో 10 నుంచి 14 మీటర్ల లోతులో భూగర్భజలాలున్నాయి.
బీడు భూములు సాగులోకి వచ్చాయి..
బీడు భూములు సాగుభూములుగా మారాయి. నేను 19 ఏండ్ల నుంచి ట్రాక్టర్ డ్రైవర్ పనిచేస్తున్నా. గతంలో కంటే ఇప్పుడు పనులు బాగా పెరిగాయి. పదేండ్ల కింద మా ఊర్ల మూడు, నాలుగు ట్రాక్టర్లే ఉండేవి. ఇప్పడు పుష్కలంగా నీళ్లు వస్తున్నవి. ఎవుసం పెరిగింది. ఉపాధి పెరిగింది. ఇప్పుడు ఊర్ల 40 ట్రాక్టర్లు ఉంటవి. మొదట్లో ట్రాక్టర్ డ్రైవర్ నా జీతం రూ.600లే. ఇప్పుడు నెలకి రూ.18 వేలు ఇస్తున్నరు. సంవత్సరం పొడువునా పని ఉంటుంది. సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన మిషన్ కాకతీయతో చెరువులు బాగు కావడంతోనే నీళ్లు పెరిగాయి. ఎవుసం కూడా పెరిగింది.
– దేవ్ ట్రాక్టర్ డ్రైవర్, విఠల్ నర్సాపూర్
ట్రాక్టర్ దున్నకాలు బాగున్నయ్..
తెలంగాణ ప్రభుత్వంలో సీఎం పున్యాణ మాకు మా ట్రాక్టర్లు మంచిగ నడుస్తున్నయ్. ప్రతిరోజు కిరాయి దొరుకుతది. లేకుంటే దున్నకాలకు పోతం. సీఎం సార్ మంచోడు. రాష్ట్రంల ఉన్నోల్లందరికీ పని జూపిస్తుండు. గిట్ల ఎప్పుడూ లేకుండే. మాకైతే జీతం అస్తుంది. మల్ల బత్తాలు వస్తున్నయ్. ఎలచ్చన్లలో మన కేసీఆర్ సార్ ఓటేపిస్తం.
– అక్కల గుట్టలు, ట్రాక్టర్ డ్రైవర్, రామాయంపేట
కూలీ దొరుకుతున్నది..
వర్షాలు మంచిగ పడ్తున్నయ్. మాకు కూలీ మంచిగ దొరుకుతుంది. ప్రతిరోజు ఎవుసం పని కూలీకి పోతం. రోజుకు రూ.500 కూలీ వస్తది. గప్పట్లనైతే మధ్య కొంతమంది ఉండి దూరంగా కూలీకి తీసుకుపోయి మా కూలీలో సగం వాల్లకే పోతుండే. గిప్పుడా బాధలు లేవు.
– సుజాత, కూలీ, గిరిజన తండా, రామాయంపేట
తెలంగాణ అచ్చిన్నుంచి ఇబ్బందుల్లేవ్
తెలంగాణ రాష్ట్రం అచ్చిన్నుంచి మాకు పంటలకు రందిలేదు. ఒకపంట ఏయ్యంగనే మల్ల పంట కోసం మడ్లను సిద్ధం జేస్తున్నం. మాకు కేసీఆర్ సార్ మంచోడు రైతులకు విత్తనాలు, ఎరువులను దుకాణాల్లో సిద్ధంగా ఉంచుతుండు. మేము కౌలు రైతులం పంటలను గూడా మంచిగ పండించుకుంటున్నం. అప్పట్లనైతే ఎరువుల కోసం క్యూలైన్ చెప్పులు పెట్టినం. గిప్పుడు గసంటి బాధలు లేవు.
– కౌలురైతు గొడిసెల రాజు, కోనాపూర్ రామాయంపేట