సిద్దిపేట, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ సర్కార్ అన్నీ కోతలు పెడుతున్నది. ఎన్నికల ముందు అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలను మోసం చేస్తున్నది. ఏడాది గడుస్తున్నా ఇంత వరకు రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఏ ఒక్కటి చేయలేదని సీఎం రేవంత్‌రెడ్డిపై రైతులు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఠంచన్‌గా పంట సాగుకాలం ప్రారంభం కాగానే రైతు బంధు డబ్బులు జమ అయ్యేవి. ఇవ్వాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి అన్ని పథకాలకు కోత పెడుతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లో సిద్ధం చేసిన రైతు బంధును మాత్రమే వేసింది. వానకాలంలో రైతులకు వేయాల్సిన రైతు భరోసాను ఎగ్గొట్టింది. యాసంగి సాగు పనులు పూర్తి అయినా ఇంత వరకు రైతు భరోసాకు దిక్కులేదు. గత నెల 26 నుంచి రైతు భరోసా కింద ఎకరానికి 6 వేల చొప్పున వేస్తామని చెప్పింది. ఎన్నికల్లో రెండు పంటలకు కలిపి ఎకరం రూ. 15 వేల చొప్పున అని చెప్పి దాన్ని తగ్గించి రూ. 12 వేలకు చేసింది. అయినా సరే అది అన్న వేస్తారా అంటే అది కూడా సరిగ్గా వేయడం లేదని రైతులు వాపోతున్నారు. మండలంలో ఒక్క గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు కింద తీసుకొని తొలి విడతలో ఎకరానికి రూ. 6 వేలచొప్పున గ్రామంలోని రైతులకు వేశారు. నాలుగు రోజుల కింద ఎకరం వరకు, రెండు రోజుల కింద రెండు ఎకరాల వరకు మూడు విడతల్లో రైతు భరోసా విడుదల చేశామని ప్రభుత్వం గొప్పలు చెప్పింది. కానీ ఏ రైతుకు పూర్తి స్థాయిలో రైతు భరోసా పడడం లేదు.
రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయడంలో అంతా గందరగోళంగా మారింది. ఏరైతుకు ఎంత భూమి ఉంటే అన్ని డబ్బులు లెక్క ప్రకారం పడాలి. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో అలా పడడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ఎకరాకు రెండు పంటలకు కలిపి రూ. 10 వేలు జమ చేశారు. పంట సాగుకు ముందే డబ్బులు రైతుల ఖాతాలో ఒక సిస్టమేటిక్‌గా వేశారు. తొలుత ఎకరం, తర్వాత రెండు ఎకరాలు…ఇలా స్లాబ్‌ల విధానంలో వారం పది రోజల్లో రైతులందరికీ పూర్తి స్థాయిలో డబ్బులు పడేవి. అప్పుడు రైతులు ఖుషీగా ఉన్నారు. కేసీఆర్ సర్కార్ మంచిగా ఉండే అని రైతులు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని కోతలు ఉన్నా యి. ఒక స్పష్టమైన విధానం అంటూ ప్రభుత్వానికి లేకుండా పోయింది. యాసంగి సాగుకు సంబంధించిన రైతు భరోసా వేస్తున్నామని చెబుతున్నారు. ఇప్పటి వరకు మూడు విడతల్లో వేశామంటూ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది. ఒక ఎకరం వరకు ఉన్న రైతులకు ఇంత వరకు దిక్కు లేదు. మెజార్టీ మంది రైతులకు రైతు భరోసా పడలేదు.ఒక వేళ పడినా ఆ రైతుకు కోతలు పెట్టి రైతు భరోసాను వేసింది. రెండు సర్వే నంబర్లు ఉంటే దానిలో ఓ సర్వే నెంబర్ కోత పెట్టడం, గుంటల్లో లెక్కలు తప్పులే చేసి వేయడం ఇలా అన్ని కోతలు పెడుతుంది. కనీసం ఇచ్చే డబ్బులు కూడా వేయడం లేదని రైతులు ప్రభుత్వంపై మండి పడుతున్నారు. మొన్న రెండు ఎకరాల్లోపు వేశామని చెప్పింది. రెండు ఎకరాల్లోపు రైతులు తమకు పడ్డాయే ఏమే అని బ్యాంకుకు వెళ్లి చూస్తే సగం సగం డబ్బులు పడ్డాయని రైతులు వాపోతున్నారు. ఇదేం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మాట ఏంది వేస్తున్న డబ్బులు ఏంటి అని రైతులు ప్రభుత్వంపై మండి పడుతున్నారు.
నంగునూరు మండలం బద్దిపడగ గ్రామానికి చెందిన ముక్కెర కరుణాకర్‌కు ఎకరం ఎనిమి ది గుంటల వ్యవసాయ భూమి ఉండగా సాగు చేసుకుంటున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం రెండు ఎకరాల్లోపు సోమవారం రైతు భరోసా విడు దల చేసింది. ఈ రైతుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎకరం రూ. 6వేల చొప్పున రూ.7,312 రావాలి. కానీ రూ. 5,325 మాత్రమే పడ్డాయి. రూ. 1,987 తక్కువ వచ్చాయి. ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు రైతులకు పడుతున్న భరోసా డబ్బులకు పొంతన లేకుండా పోయింది.
దుబ్బాక మండలం పెద్దగుండవెల్లికి చెందిన యాడవరం రమేశ్‌కు రెండు సర్వే నంబర్లలో వేర్వేరుగా 0-28 గుంటల భూమి ఉంది. కానీ కేవలం ఒక్క సర్వే నెంబర్లోని 14 గుంటల భూమికి మాత్రమే రూ 2,100 ప్రభుత్వం రైతు భరోసా జమచేసింది.మిగతా 0-14 గుంటల భూమికి సంబంధించిన డబ్బులు జమ కాలేదు. వేసే రైతు భరోసా డబ్బులు కూడా సరిగ్గా రావడం లేదు. ఇప్పటికే వానకాలం రైతు భరోసా ఎగ్గొట్టింది. ఇప్పుడు అరకొర వేస్తున్నారని రైతు తన ఆవేదన వ్యక్తం చేశారు. సగం భూమికి డబ్బులు ఇవ్వడం ఏమిటో అర్థం కావడం లేదు.
నంగునూరు మండలం అక్కెనపల్లికి చెందిన సురేశ్ అనే రైతుకు 0-21 గుంటల భూమి ఉంది. రైతు భరోసా కింద రూ. 2,625 పడ్డాయి. ఇది ఏలెక్కన వేశారో అర్థం కాని పరిస్థితి. రైతు భరోసా కింద రూ. 6వేలు ఎకరానికి వేస్తున్నారు. ఈ రైతుకు 21 గుంటలకు రూ.3,150 జమ కావాలి. రూ 525 తక్కువ పడ్డాయి. ఇది ఏలెక్కన వేశారు అని వ్యవసాయశాఖ అధికారులను సంప్రదిస్తే మాకేం తెలియదు అని సమాధానం. ఇదేం ప్రభుత్వం ఇదేం భరోసా అంటూ ప్రభుత్వంపై రైతు మండిపడుతున్నాడు.