సిద్దిపేట, మే 30: సర్కారు తీరుతో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండడంతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు.శనివారం సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరులోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. 50 రోజులుగా వడ్లు తెచ్చి పడిగాపులు పడుతున్న రైతులను, 12 రోజులుగా కొనుగోళ్లు నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులను కలిసి వారి బాధలు అడిగి తెలుసుకున్నారు. కల్లాల్లోనే పడిగాపులు కాస్తున్న రైతులకు హరీశ్‌రావు భరోసానిచ్చారు. అకడి నుంచే ఆర్డీవో, ఇతర అధికారులకు ఫోన్ చేసి కొనుగోల్లు వేగవంతం చేయాలని ఆదేశించారు. పుల్లూరు కేంద్రంలో ఇంకా 40, 50 లారీల వడ్లు పేరుకుపోయాయని, రైతులు వడ్లు తెచ్చి 50 రోజులు అవుతున్నా కాంటా ఎందుకు చేయడం లేదని ఆర్డీవోను హరీశ్‌రావు ప్రశ్నించారు. మీరేమో ఆరు రోజులకు ఒక లారీ పంపిస్తే ఎప్పటికీ ధా న్యం సేకరణ పూర్తవుతుందని అన్నారు.
మిల్లర్లు ఒకో రైతు దగ్గర క్విం టాల్‌కు ఐదారు కిలో లు కటింగ్ పెడుతూ గోసపెడుతున్నారని, కటింగ్‌కు ఒప్పుకొంటేనే ధాన్యం దించుకుంటున్నారని, ఇది పద్ధతి కాదని, మీ తహసీల్దార్‌ను తీసుకుని వెంటనే పుల్లూరు వచ్చి ఈ సమస్యను పరిషరించాలని ఆర్డ్డీవోను హరీశ్‌రావు ఆదేశించారు. రైతులు ఇన్ని రోజులు ఎండబెట్టిన వడ్లను బీ-గ్రేడ్‌లో కొంటూ అన్యాయం చేస్తారా? వాళ్లు ధర్నా చేసినా పట్టించుకోరా? అధికారుల నిర్లక్ష్యంతోనే రైతులు ఆగమవుతున్నారని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోహిణీ కార్తె వచ్చిందని, ఎప్పుడైనా వర్షాలు పడొచ్చని, వారం రోజుల్లో వడ్లు ఎత్తకపోతే తడిసిపోయే ప్రమాదం ఉందన్నారు. రోజుకు ఐదారు లారీలు పెట్టి, ఒక గింజ కూడా కటింగ్ లేకుండా చూడాల్సిన బాధ్యత మీదేనని ఆర్డ్డీవోకు హరీశ్‌రావు సూచించారు. సివిల్ సప్లయ్ అధికారితో మాట్లాడుతూ.. శివశివాని, ఎంఎం ఫుడ్స్ మిల్ల ర్లు మూడు కిలోల కటింగ్ పెడుతున్నారని రైతులు చెబుతున్నారని, మీరేమో వాళ్లతోనే మాట్లాడుకోమని రైతులకు చెబుతున్నారట, ఇదేం పద్ధతి? వెంటనే కటింగ్ లేకుండా వడ్లు దిగేలా చూడాలని అధికారిని హరీశ్‌రావు ఆదేశించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో వడ్లు అమ్ముకోవాలంటే రైతుల కళ్లలో రక్తం వస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం యూరియా, డీఏపీ ధరలు పెంచిందని, ఇకడ కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోళ్లు సరిగ్గా చేయడం లేదన్నారు. మిల్లర్ల దోపిడీకి వదిలేసిందన్నారు. కాంగ్రెస్ సరార్ ఇప్పటికే రైతుబంధు, రైతుబీమా బంద్ పెట్టిందన్నారు. కేసీఆర్ పాలనలో రైతు చనిపోతే బీమా డబ్బులు వారం రోజుల్లో రూ.5 లక్షలు వచ్చేవని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ఇప్పుడు కరెంటును కూడా ఆగం చేస్తున్నారని, కొత్తగా రైతు డిసం పేరుతో రైతుల మెడలకు ఉరితాడు బిగించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని హరీశ్‌రావు అన్నారు. రైతు డిసం అమల్లోకి వస్తే ఉదయం ఏడింటికి ఇచ్చి, సాయంత్రం ఐదింటికి కరెంటు తీసేస్తారని, రాత్రి కరెంటు ఉండనే ఉండదన్నారు. 24 గంటల కరెంటుకు ఎసరుపెట్టే ఈ కుట్రను మనం అడ్డుకోవాలని రైతులకు హరీశ్‌రావు పిలుపునిచ్చారు.