వానకాలం ప్రారంభమై నెలన్నర రోజులు గడుస్తున్నా మెదక్ జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. రైతులు వేసిన విత్తనాలు మొలకలు రావడం లేదు. పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, కందులు, పసర్లు, మినుములతో పాటు వరి తుకాలు, నాట్లు ఎండుముఖం పడుతున్నాయి. దీంతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఘనపూర్ వనదుర్గా ప్రాజెక్టులో నీరు లేక రైతులు తుకాలు పోయడం లేదు. ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో నీటి నిల్వలు తగ్గిపోయాయి. భూగర్భ జలాలు తగ్గిపోవడంతో గ్రామాల్లో తాగు, సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. కొత్తగా బోర్లు వేసినా నీరు పడక రైతులు అప్పులపాలవుతున్నారు. రైతులు ఆకాశం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు పడటం లేదని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.
మెదక్, జూలై 16(నమస్తే తెలంగాణ): ఈ వానకాలం సీజన్లో మెదక్ జిల్లాలో 3,42,814 ఎకరాల్లో రైతులు పంటలు సాగుచేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేసింది. జూలై 10 తేదీ వరకు జిల్లావ్యాప్తంగా కేవలం 47,327 ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. గతేడాది ఇదే సమయంలో జిల్లాలో 3,65,010 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. జిల్లా వ్యాప్తంగా అత్యధిక విస్తీర్ణంలో సాగుయ్యే వరి 2,69,043 ఎకరాలు లక్ష్యంగా ఉండగా, ఇప్పటి వరకు 3, 234 ఎకరాల్లో సాగు చేశారు. పత్తి 31, 880 ఎకరాలు, మొక్కజొన్న 1,336, కందులు 1,528, పెసర్లు 1445, మినుములు 826 ఎకరాల్లో సాగు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.

వర్షాలు పడటం లేదు. దీంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. బోరు, బావుల్లో నీటి మట్టం పడిపోతున్నది. బోర్లపై ఆధారపడి పంటలు సాగు చేస్తున్న రైతులు సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్తగా బోర్లు వేసినా నీరు పడక రైతులు అప్పుల పాలవుతున్నారు. మెదక్ జిల్లాలోని పెద్దశంకరంపేటలో జూన్ నుంచి జూలై 10 వరకు 175.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రేగోడ్ మండలంలో 188.1 మిల్లీమీటర్ల లోటు వర్షపాతం నమోదైంది. అల్లాదుర్గంలో 190.2 ఎం.ఎం సాధారణం, టేక్మాల్‌లో 179.4 ఎం.ఎం లోటు వర్షపాతం నమోదైంది.

పాపన్నపేటలో 171.9 ఎం.ఎం లోటు వర్షపాతం, హవేళి ఘనపూర్‌లో 191.5 ఎం.ఎం లోటు వర్షపాతం, రామాయంపేటలో 166.2 ఎం.ఎం. లోటు వర్షపాతం, నిజాంపేటలో 166.0 ఎం.ఎం. లోటు వర్షపాతం, చేగుంట 163.3 ఎం.ఎం వర్షపాతం నమోదైంది. నార్సింగిలో 170.6 ఎం.ఎం సాధారణ వర్షపాతం నమోదైంది.

చిన్నశంకరంపేటలో 180.3 ఎం.ఎం లోటు వర్షపాతం, మెదక్‌లో 192.1 ఎం.ఎం లోటు వర్షపాతం, కొల్చారంలో 162.7 ఎం.ఎం లోటు వర్షపాతం, చిలిపిచెడ్‌లో 175.7 లోటు వర్షపాతం, కౌడిపల్లిలో 170.7 లోటు వర్షపాతం నమోదైంది. అలాగే నర్సాపూర్‌లో 178.9 ఎం.ఎం సాధారణం, శివ్వంపేటలో 150.8 ఎం.ఎం సాధారణ, వెల్దుర్తిలో 165.9 ఎం.ఎం సాధారణ, తూప్రాన్‌లో 155.6 సాధారణ, మనోహరాబాద్‌లో 146.8 ఎం.ఎం సాధారణ, మాసాయిపేటలో 167.1 ఎం.ఎం వర్షపాతం నమోదైంది.

బోరుబావుల్లో నీళ్లు రాక పంటలన్నీ ఎండిపోతున్నాయి. వర్షాలు పడటం లేదు. బోర్లలో నీళ్లు వస్తలేవు. మేము ఏంచేయాలో మాకే అర్థం కావడం లేదు. కండ్ల ముందు పంటలన్నీ వాడిపోతున్నాయి.
– ఆకుల రాములు, నందిగామ, రామాయంపేట (మెదక్ జిల్లా)
బోర్లలో నీళ్లు వస్తలేవు.కనీసం తాగుదామన్నా నీళ్లు ఎక్కడా దొరుకుత లేవు. పంటలకు పారిద్దామన్నా బోర్ల నుంచి నీళ్లు వస్తలేవు. మేమెట్ల బతకాలో మాకే తెలుస్తలేదు.నా భర్త పనుల కోసం వేరే ప్రాంతానికి వెళ్లాడు. నేను వ్యవసాయం చేసుకుందామంటే నీళ్లు
వస్తలేవు.
– కేతావత్ సుజాత, గిరిజన మహిళా రైతు (మెదక్ జిల్లా)
వానదేవుడు కురుణిస్తాడని ఆశించినా ఫలితం దక్కలేదు. రైతులకు కన్నీరే మిగిలింది. తీరా వర్షాలు పడక కండ్లు ముందే నారుమడులు ఎండిపోతున్నాయి. బోరు, బావుల్లో భూగర్భజలాలు అడుగంటిపోయాయి.తాగటానికి నీరు, మేత లేక పశువులు అల్లాడిపోతున్నాయి. వానదేవుడు కరుణించి వానలు కురిపించకపోతే ఈఏడాది రైతుల వలసలు పెరగడం ఖాయం.
– ఎన్.బాగయ్య, రైతు, చండూర్ (మెదక్ జిల్లా)
నలభై రోజుల నుంచి గట్టి వాన లేదు. పంటలకు నీళ్లు లేక వాడి పోతున్నాయి. సగం కాలం పోయింది. ఇప్పుడు వర్షాలు కరుస్తాయనే గ్యారెంటీ లేదు. మాకైతే కరువచ్చినట్టే ఉంది. బోరుబావుల్లో నీళ్లు కూడా అడుగంటి పోయాయి.
మా బతుకులు రోడ్డున పడ్డట్టే.
– సార్గు సత్యనారాయణ, రామాయంపేట (మెదక్ జిల్లా)
గొంగళ్లు విక్రయించి జీవనం కొనసాగిస్తా. ఈ సీజన్లో వర్షాలు లేవు. ఏ గ్రామానికి పోయినా ఒక్కరు కూడా గొంగడి కొంటమని ముందుకు వస్తలేరు.ఎప్పుడైనా వానకాలంలోనే గొంగళ్లకు గిరాకీ ఉంటుంది. ఈ సంవత్సరం అసలు గిరాకులే లేవు. ఎట్ల బతకాలో అర్థం కావడం లేదు.
-గొంగళ్ల వెంకన్న, రామాయంపేట (మెదక్ జిల్లా)
వర్షాలు పడటం లేదు. పంటలు పండుతాయనే గ్యారెంటీ లేదు. ఏం చేయాలో మాకు తోస్తలేదు. మేము చూస్తుండగానే కండ్ల ముందు పంటలు ఎండిపోతున్నాయి. మమ్ముల్ని ప్రభుత్వం ఆదుకోవాలి.
– లంబాడీ రాధమ్మ, కోనాపూర్ తండా, రామాయంపేట (మెదక్ జిల్లా)