పటాన్చెరు, మే 29 : కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ఎరువులు, విత్తనాల పై సబ్సిడీని ఎత్తివేస్తున్నది. మరో వైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్నది. పంటల సాగు కోసం రైతులు వినియోగించే యంత్రాల అద్దెలు పెరిగిపోతున్నాయి. అన్నదాతలకు ప్రతి ఏడాది పెట్టుబడి ఖర్చులు భారీగా పెరుగుతున్నా కేంద్రం పంటల మద్దతు ధర పెంచడంలో నిర్లక్ష్యం వహిస్తోంది. కేంద్రం ఈ ఏడాది పంటల మద్దతు ధర ప్రకటించింది. వరికి మద్దతు క్వింటాల్‌కు రూ. 69 పెంచింది. గత ఏడాది వరికి మద్దతు ధర రూ.117 పెంచింది.
గత ఏడాది కంటే మద్దతు ధర ఈ ఏడాది రూ.48 తగ్గించింది. పంటల సాగు ఖర్చు పెరిగినా మద్దతు ధర పెంచకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కేంద్రం వరి సహా 14 పంటలకు కనీస మద్దతు ధర పెంచింది. వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరలను (ఎంఎస్పీ) పెంచుతూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. వరి, పప్పుధాన్యాలు, నూనె గింజల పంట ఉత్పత్తులపై 9 శాతం చొప్పున ఎంఎస్పీ పెంచినట్లు ప్రకటించింది. పెంచిన మద్దతు ధరలు 2025-26 ఏడాదికి అమల్లో ఉంటాయని ప్రకటించింది.
ఏటా పెరుగుతున్న సాగు పెట్టుబడులకు అనుగుణంగా కేంద్రం పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) అమలు చేస్తుంది. కేంద్రం 2024-25లో వానకాలం వరికి క్వింటాల్‌కు మద్దతు ధర రూ. 117 పెంచి, రూ.2320 చేసింది. ఈ ఏడాది కేంద్రం వరికి మద్దతు ధర క్వింటాల్‌కు రూ.. 69 పెంచి. మద్దతు ధర రూ. 2369 ప్రకటించింది. వరికి రూ.69 పెంచడంతో గత ఏడాది కంటే రూ.48 తక్కువగా ప్రకటించింది. పెట్టుబడి ఖర్చులు పెరిగినా కేంద్రం కనీస మద్దతు ధర పెంచకపోవడం పై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 2025-26 వానకాలం సీజన్‌కు మద్దతు ధర వరి ఏ గ్రేడ్ క్వింటాల్‌కు రూ. 2389 చేసింది. పత్తి (మధ్య రకం) రూ. 589 పెంచి, మద్దతు ధర రూ.7710 ప్రకటించింది.
పత్తి పొడవు రకానికి రూ. 589 పెంచి రూ.8110 చేసింది. కందులకు రూ. 450 పెంచి రూ. 8000 చేసింది. పెసర్లకు రూ. 86 పెంచి రూ. 8768కు చేసింది. మినుములకు రూ. 400 పెంచి క్వింటాల్‌కు రూ.7800గా ప్రకటించింది. మొక్కజొన్నకు రూ.175 పెంచి రూ.2400 చేసింది. సజ్జలకు రూ. 150 పెంచి రూ.2775 చేసింది. రాగికి రూ. 596 పెంచి రూ.4886 మద్దతు ధర ప్రకటించింది. వేరు శనగకు రూ. 480 పెంచి, రూ. 7263 చేసింది. పొద్దు తిరుగుడుకు రూ. 441 పెంచి రూ.7721 మద్దతు ధర చేసింది. నువ్వులకు రూ. 579 పెంచి రూ.9846 చేసింది. సోయాబీన్‌కు రూ. 436 పెంచి రూ. 5329 మద్దతు ధర ప్రకటించింది.
బహిరంగ మార్కెట్లో ఉన్న ధర కంటే కేంద్రం మద్దతు ధర తక్కువగా ప్రకటించిందని రైతులు వాపోయారు. పత్తి క్వింటాల్‌కు గత ఏడాది రూ. 8500 వరకు రైతులు బహిరంగ మార్కెట్లో విక్రయించారు. వరి సాధారణ రకం క్వింటాల్‌కు రూ. 2500 వరకు, వరి ఏగ్రేడ్ రూ.2700 , మొక్కజొన్న రూ.3200, కంది రూ. 9950 , మినుములు క్వింటల్‌కు రూ.8000 వరకు రైతులు విక్రయిం చారు. వరి, పత్తి ధాన్యాన్ని వ్యాపారులు ఎక్కువగా రైతుల ఇండ్ల వద్దనే కొనుగోలు చేశారు. కేంద్రం బహిరంగ మార్కెట్లో ఉన్న ధరను ప్రకటించలేదు. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా మద్దతు ధర ప్రకటించలేదు.
ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల వద్ద తేమపేరుతో రైతుల ధాన్యం ఎక్కువ శాతం కొనుగోలు చేయలేదు. పత్తిని సీసీఐ కొనుగోలు చేయకపోతే ప్రైవేట్ వ్యాపారులకు రైతులు అమ్మకాలు చేశారు. రాష్ర్టాల నుంచి అభిప్రాయలు తీసుకొని, పంటల సాగు ఖర్చులు పరిగణలోకి తీసుకొని జాతీయ వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్(సీఏసీపీ) సిఫార్సు చేస్తే కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం ఆనవాయితీగా వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుల అంచనాలు వేసి కమిషన్‌కు నివేదించినా అమలు చేయడం లేదు.