రామాయంపేట, మే 17: నెల రోజులు కావస్తున్నా వడ్లు తూకం వేయడం లేదంటూ మెదక్ జిల్లా రామాయంపేటలోని ఎస్సీ కాలనీ శివారులోని సొసైటీ కొనుగోలు కేంద్రం వద్ద ఆదివారం రైతులు రాస్తారోకో చేశారు. ధాన్యం కాంటా చేయడం లేదని, వర్షం వస్తే తమ పరిస్థితి ఏమిటని సిబ్బందిని రైతులు నిలదీశారు. సొసైటీ సిబ్బందిని ఎప్పుడు అడిగినా రేపు మాపు అంటూ కాలం వెల్లదీస్తున్నారని మండిపడ్డారు.
ధాన్యం తూకం వేసే వరకు ఇక్కడి నుంచి కదలమని రైతులు భీష్మించుకుని కూర్చున్నారు. సొసైటీ సిబ్బంది వచ్చి ఎంత బతిమిలాడిన రైతులు ససేమిరా అంటూ వారితో వాగ్వాదానికి దిగారు.రైతుల రాస్తారోకోతో గంట పాటు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచి పోయాయి. స్థానిక ఎస్సై బాలరాజు తన సిబ్బందితో రాస్తారోకో వద్దకు చేరుకుని రైతులను సముదాయించారు. రైతులు అయినా ససేమిరా అనడంతో అక్కడే ఉన్న సొ సైటీ సిబ్బంది, రైతులతో మాట్లాడించారు. రెండు మూడు రోజుల్లో ధాన్యం మొ త్తం కాంటా వేస్తామని సొసైటీ సి బ్బంది చెప్పగా రైతులు శాం తించారు.
కొనుగోలు కేంద్రానికి వడ్లు తెచ్చి 30 రోజులు అయ్యింది.ఎప్పుడు కాంటా పెట్టమన్నా. జర్ర ఆగుండ్రి అనుకుంట జరుపుతున్నరు.త్వరగా వడ్లు కాంటా పెట్టాలి. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఇట్ల కాలేదు. ముందుగల్ల రైతుల ధాన్యం తీసుకుని డబ్బులు కూడా సమయానికి వేసిండు. ఈ ప్రభుత్వం వడ్లు కొనుడేలేదు. మల్ల పైసలు ఎప్పుడిస్తరో.
– గావు యాదగిరి, రైతు, రామాయంపేట
ఎండిన వడ్లకు తూకం వేయకుండా మమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తుండ్రు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడు సూడలేదు. నెల
రోజులుగా వడ్లను ఎండ బెట్టినం. ఇంకా తూకం ఎందుకు వేయడం. రైతులను ఇబ్బందులకు గురిచేస్తే మంచిది కాదు. గింత గోస పెట్టడం అధికారులకు తగదు.
– ఐటంకరి ఎల్లమ్మ, సావిత్రి, మహిళా రైతులు, రామాయంపేట
వర్షం వస్తే ధాన్యం దెబ్బతింటది. వడ్ల కుప్పలన్నీ కొట్టుకు పోతాయి. వడ్లు మంచిగ ఎండినయి. మ్యాచర్ కూడా చూసిండ్రు. కాంటా పెట్టమంటేనే పెడ్తలేరు.వడ్ల కుప్పల మీద ఒక్క చినుకు పడ్డా ధాన్యం చేతికి రాదు. వడ్లను వెంటనే కాంటా పెట్టి రైస్‌మిల్‌కు పంపాలి.
– బైరం భూమయ్య, రైతు, రామాయంపేట