stock market : భారత స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. ఐటీ స్టాక్స్ పతనం, క్రూడాయిల్ ధరల పెరుగుదల వంటి కారణాలతో మార్కెట్ నష్టాల బాటలో సాగింది. బీఎస్ఈ సెన్సెక్స్ 281 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 78 పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్ రోజులో గరిష్టంగా 77,928.68 పాయింట్లకు చేరుకోగా, కనిష్టంగా 77,453.75 పాయింట్లకు పడిపోయింది. రోజులో 474.93 పాయింట్లు దిగజారింది. చివరకు 281.09 పాయింట్ల (0.36 శాతం) నష్టంతో 77,728.16 వద్ద ముగిసింది.
ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 షేర్ ఇండెక్స్ కూడా 78.35 పాయింట్లు (0.32 శాతం) నష్టంతో 24,287.65 వద్ద ముగిసింది. బ్రాడర్ మార్కెట్ మిశ్రమ ఫలితాల్ని పొందింది. బీఎస్ఈ మిడ్‌క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్ 20.19 పాయింట్లు (0.11 శాతం) నష్టపోగా, బీఎస్ఈ స్మాల్ క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్ 34.70 పాయింట్లు (0.38 శాతం) లాభపడింది. నిఫ్టీలో ఐటీ షేర్లు 1.75 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ షేర్లు 1.05 శాతం నష్టపోగా, నిఫ్టీ రియాల్టీ షేర్లు మాత్రం 1.46 శాతం లాభపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో బీఈఎల్, హెచ్డీఎఫ్సీ, రిలయన్స్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్ లాభపడ్డాయి. వీటిలో టాటా స్టీల్ 1.47 శాతం లాభపడింది. మరోవైపు టీసీఎస్, సన్‌ఫార్మా, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్ షేర్లు నష్టపోయాయి.
వీటిలో ఇన్ఫోసిస్ 2.66 శాతం నష్టపోయింది. మరోవైపు డాలర్‌తో రూపాయి 12 పైసలు పతనమైంది. సోమవారం డాలర్‌తో రూపాయి మారక విలువ 95.61 వద్ద కొనసాగింది. అంతర్జాతీయ మార్కెట్లో్ బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 89.54 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయంగా బంగారం ఔన్స్ ధర 4,394.13 డాలర్ల వద్ద కొనసాగుతోంది.