పుల్కల్, జూలై 10: ‘వానలు లేవు.. నీళ్లియ్యరు.. వ్యవసాయం సాగేదెట్లా?’ అని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోనే సింగూరు అతిపెద్ద ప్రాజెక్టు. ఏటా యాసంగిలో పంటల సాగుకు సింగూరు కాలువ ద్వారా నీటిని విడుదల చేస్తారు. ఈ సీజన్లో నెలన్నర గడిచినా వర్షాల జాడలేదు. సింగూరు కాలువ నుంచి కూడా నీటిని విడుదల చేయకపోవడంతో తుకాలు ఎండి పోతున్నాయని రైతులు దిగులు చెందుతున్నారు.
మెదక్ జిల్లాలోని సింగూరు కెనాల్ కింద పుల్కల్, చౌటకూర్ మండలాల్లోని మిన్పూర్, ముద్దాయిపేట, పోచారం, బస్వాపూర్, ముదిమాణిక్యం, ఎస్ ఇటిక్యాల్, బొమ్మారెడ్డి గూడెం, లక్ష్మీసాగర్ అందోల్ మండలం వరకు 40 వేల ఎకరాలకు సాగు నీరు విడుదల చేస్తే ఈ పాటికే వరి నాట్లు పడి పంటలన్నీ పచ్చగా కళకళాలాడుతూ కనిపించేవి. ఈ సీజన్లో వర్షాలు పడకపోవడంతో రైతులంతా సింగూరు కెనాల్ పైనే ఆశలు పెట్టుకున్నారు.
కానీ ఎడమ కాలువ ద్వారా ఇప్పటివరకు నీటిని విడుదల చేయకపోవడంతో పంటలు నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు తెచ్చి సాగు చేశామని, పంటలు చేతికి రాకపోతే అప్పులు తీర్చేదెలా అంటూ మదనపడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఇప్పటికే కెనాల్ ద్వారా నీటిని విడుదల చేసేవారని, కానీ మంత్రి దామోదర రాజనర్సింహ సొంత నియోజకవర్గంలోనే తమకు ఇన్ని కష్టాలెందుకని రైతులు ప్రశ్నిస్తున్నారు.
సింగూర్ కెనాల్ కాలువ ద్వారా సాగుకు నీళ్లిచ్చి రైతులను ఆదుకోవాలి. వర్షాలు పడ్తలేవు. తుకాలు ఎండిపోతున్నాయి. తొందరగా నీటిని విడుద ల చేస్తేనే వరి నాట్లు వేసుకుంటం. లేదంటే తుకాలు ఎండిపోతే మా పరిస్థితులు ఆగమైతయి. మాపై దయచూపి కెనాల్ నీటిని విడుదల చేయించాలి.
– పోచారం నర్సింహులు, రైతు, పుల్కల్, మెదక్ జిల్లా
రైతులను దృష్టిలో ఉంచుకొని తక్షణమే సింగూరు కాలువ ద్వారా నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం చొరవ చూపాలి. రైతులకు సాగు నీరు అందించాల్సిందిపోయి హైదరాబాద్కు తాగు నీటిని విడుదల చేయడం సరికాదు. పట్టణ వాసులపై ఉన్నంత ప్రేమ రైతుల పట్ల ఉండాలి కదా? దామోదర్ రాజనర్సింహ ఉమ్మడి మెదక్ జిల్లాకు మంత్రి అయి ఉండి కూడా సాగు నీటి విడుదల విషయంలో జాప్యం ఎందుకు జరుగుతుందో అర్థంకావడం లేదు. అందోల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రికి ఈ ప్రాంత రైతుల బాధలు పట్టవా? వెంటనే సింగూరు కెనాల్ ద్వారా నీటిని విడుదల చేయించాలి. కాలువలకు సీసీ లైనింగ్ పేరుతో జాప్యం చేయడం సరికాదు. రెండు పంటలకు సాగు నీరియ్యలేదు. ఈ సారైనా ఇస్తారా లేదా? రైతులను మోసం చేస్తే ఊరుకోం.
– చంటి క్రాంతికిరణ్, అందోల్ మాజీ ఎమ్మెల్యే
పదిహేను ఎకరాలు నాటుకు సిద్ధం చేసిన. కెనాల్ నీటిని విడుదల చేస్తేనే పంటలకు ఊపిరి పోసినట్టు అవుతుం ది. కాలువను నమ్ముకొని రైతులంతా పంటలు వేసిండ్రు. ఇప్పటికే రెండు పంటలు నష్ట పోయాం. కనీసం ఈ సారైనా సింగూరు ప్రాజెక్టు నుంచి నీరు వదులుతారని ఆశతో ఎదురుచూస్తున్నం. నీటిని మమ్మల్ని ఆదుకోవాలి.
-కుమ్మరి లక్ష్మణ్, రైతు, ముద్దాయిపేట, మెదక్ జిల్లా