రాయపోల్, మార్చి 17 : తలాపున గోదావరి నీళ్లు పారుతున్నప్పటికీ తమ పంట పొలాలకు నీరందక ఎండిపోతున్నాయని మెదక్ జిల్లా చేగుంట మండలంలోని పలు గ్రామాల రైతులు సోమవారం సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్ చౌరస్తాలోని రామాయంపేట కెనాల్ వద్ద రోడ్డుపై టెంట్లు వేసుకుని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో గజ్వేల్-చేగుంట ప్రధాన రహదారి కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
మెదక్ జిల్లా చేగుంట మండలంలోని పోతన్‌పల్లి, చందాయిపేట, కసాన్పల్లి, పోతంశెట్‌పల్లి, మక్కరాజ్‌పేట, దౌల్తాబాద్ మండలంలోని మాచిన్పల్లితో పాటు తదితర గ్రామాలకు చెందిన సుమారు 500 మంది రైతులు రోడ్డుపై భైఠాయించారు. టెంట్లు వేసుకుని సాయంత్రం వరకు నిరసన తెలిపారు. పార్టీలకతీతంగా రైతులు,నాయకులు అందరూ ఒక్కటై రోడ్డు దిగ్బంధం చేశారు. తమ గ్రామాల పక్క నుంచే వెళ్తున్న గోదావని నీరు తమకు రాకపోవడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుప్రియాల్ వద్ద రామాయంపేట కెనాల్ నుంచి కొద్ది దూరంలోని తమ గ్రామాల గొలుసుకట్టు చెరువులు నింపి నీరు అందిస్తే యాసంగి పంటలు దక్కుతాయని రైతులు తెలిపారు.
రైతులు ఆందోళన విషయంగా తెలియగానే తొగుట సీఐ లతీఫ్ వచ్చి వారిని సముదాహించే ప్రయత్నం చేశారు. రైతులు వినిపించుకోకుండా వారి ఆందోళన మరింత ఉధృతం చేశారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ దుబ్బాక నిజయోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి హుటాహుటిన అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. సాగునీరు అందించేందుకు కృషిచేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఇందుప్రియాల్ వద్ద రామాయంపేట కెనాల్ ద్వానా వస్తున్న గోదావరి జలాలను ఆయన పరిశీలించారు. ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. చేగుంట రైతులకు సాగునీరు అందించాలని కోరారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు.