నంగునూరు, నవంబర్ 3: ఆరుగాలం పండించిన పంట కొనుగోలు కేంద్రానికి తీసుకువస్తే వెంటనే కొనుగోలు జరగక కడుపు మండిన రైతులు సిద్దిపేట జిల్లా నంగునూరు మండల తహసీల్ కార్యాలయం ఎదుట సోమవారం తడిసిన ధాన్యం పోసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వివేకానంద చౌరస్తా వద్దకు చేరుకొని ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.
తహసీల్దార్ సమస్య పరిషరించే వరకూ ధర్నా విరమించబోమని బైఠాయించారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అధికారుల నిర్లక్ష్య ధోరణి వీడాలని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిరసన గళం వినిపించారు. నిబంధన ప్రకారం తేమశాతం ఉన్నప్పటికీ కొనుగోలు చేయడంలేదని రైతులు ఆరోపించారు. అధికారులు, రైస్ మిల్లర్లు కుమ్మకై నట్టేట ముంచుతున్నారని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు సరిగ్గా పనిచేయడం లేదని, సరైన సమయానికి గన్నీబ్యాగులు అందించడం లేదని వాపోయారు. సమయానికి ధాన్యం సేకరిస్తే ఇంతనష్టం జరిగి ఉండేది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వ్యవసాయాధికారి, గ్రామాల్లో ఏవోలు క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదని, ఫోన్ చేస్తే స్పందించడం లేదని రైతులు వాపోయారు. పంట నష్టం వివరాలు సరిగ్గా సేకరించడం లేదని, సర్వే చేయకుండా ప్రభుత్వం నష్టపరిహారం ఎవరికి ఇస్తుందని ప్రశ్నించారు. రైతు వేదికల్లో కనీస సౌకర్యాలు లేవని ఆందోళన వ్యక్తం చేశారు. వర్షం వచ్చిన సందర్భంలో ఉపయోగించుకుందామనుకుంటే అధికారులు అనుమతులు లేవంటూ దబాయిస్తున్నారని ఆరోపించారు. ఏవో సహకరించకపోవడంతో పాటు రైతువేదికకు తాళం వేసుకొని వెళ్లాడన్నారు. రైతులకు ఉపయోగపడేలా కట్టిన రైతువేదికలు ఉపయోగించుకునే వీలు లేదా అని రైతులు ప్రశ్నించారు.ఏవోను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
రైతుల ధర్నా విషయం తెలుసుకున్న తహసీల్దార్ మాధవి, సీఐ శ్రీనివాస్, ఎస్సై వివేక్ అక్కడికి చేరుకున్నారు. తహసీల్దార్ మాధవి రైతులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అనంతరం కొనుగోలు కేంద్రానికి వెళ్లి క్షేత్రస్థాయిలో తడిసిన ధాన్యాన్ని, తేమ శాతాన్ని స్వయంగా పరిశీలించారు. తడిసిన ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ఏఈవో సక్రమంగా పనిచేయడం లేదని, వెంటనే సస్పెండ్ చేయాలని రైతులు తమ సమస్యలు వివరిస్తూ డీసీవో వరలక్ష్మి, తహసీల్దార్ మాధవికి వినతి పత్రాలు అందజేశారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే రాస్తారోకోలు, ప్రభుత్వ కార్యాలయం ముట్టడి, ఆందోళన చేస్తామని రైతులు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేశారు.