న్యూఢిల్లీ, మార్చి1 : ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా సైనిక దాడుల్ని నిరసిస్తూ చేపట్టే ప్రదర్శనలపై కేంద్రం నిఘా వేసింది. ఇరాన్‌కు అనుకూలంగా రెచ్చగొట్టే ప్రసంగాలు, ప్రకటనలు చేసే రాడికల్ మత బోధకులపై ఓ కన్నేసి ఉంచాలని ఆయా రాష్ర్టాలను కేంద్రం అప్రమత్తం చేసింది. ఈ మేరకు ఫిబ్రవరి 28న అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం ఓ సర్క్యులర్ జారీచేసింది.
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం పట్ల షియా ముస్లింలు ఆదివారం భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఆయా రాష్ర్టాలు, యూటీల్లో అమెరికా, ఇజ్రాయెల్ కాన్సులేట్స్, ఇతర సంస్థల వద్ద భద్రతను పెంచాలని కేంద్రం సూచించింది. తీవ్రవాదులు, ప్రపంచ ఉగ్రవాద సంస్థ సోషల్ మీడియా ఖాతాలపై నిఘా ఉంచాలని తెలిపింది. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చూసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించింది.