జహీరాబాద్, మార్చి 12: మూడు పంటలు పండే సారవంతమైన భూములను నిమ్జ్ ప్రాజెక్టుకు ఇవ్వమని రైతులు తేల్చి చేప్పారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని మామిడ్గి గ్రామ రైతు వేదికలో బుధవారం జహీరాబాద్ నిమ్జ్ ప్రాజెక్టు ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ రాజు ఆధ్వర్యంలో భూసేకరణపై రైతులకు అవగాహన, అభ్యంతరాల స్వీకరణ కోసం భారీ బం దోబస్తు మధ్య గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా నిమ్జ్ ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్ మాట్లాడుతూ.. నిమ్జ్ ప్రాజెక్టు కోసం గ్రామంలో 1169 ఎకరాల భూమిని సేకరిస్తున్నామని తెలిపారు. పట్టా, ప్రభుత్వ భూములకు రూ.15 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని చెప్పారు. రైతులు ముందుకు రావాలని కోరారు. ఈ సం దర్భంగా గ్రామస్తులు మాట్లాడారు.
మూడేండ్లుగా తమ గ్రామ భూముల రిజిస్ట్రేషన్లు నిలిపివేశారని, ఎలా రిజిస్ట్రేషన్ ప్రకారం మెరుగైన పరిహారాన్ని చెల్లిస్తారని అధికారులను ప్రశ్నించారు. జనరల్ అవార్టు కింద చెల్లించే పరిహారంతో ఇంటి ప్లాటు రావడం లేదన్నారు. పట్టా భూములను ఇతరులకు అమ్ముకునేందుకు వీలు లేకుండానిలిపివేశారని, బ్యాంకులో రుణాలు ఇవ్వకుండా ఆదేశాలు జారీచేయడం దారుణమని పేర్కొన్నారు.
మెరుగైన పరిహారం ఇవ్వకుండా, బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు కాకుండా తమను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని అధికారుల తీరుపై గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొం దరు రైతులు నిమ్జ్ ప్రాజెక్టుకు భూములు ఇస్తామని చెప్పడంతో మరికొందరు రైతులు అడ్డుకున్నారు. దీంతో రైతుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని రైతు వేదికలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో నిమ్జ్ ప్రాజెక్టు అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
నిమ్జ్ అధికారులు అర్థంతరంగా వెళ్లిపోవడంతో రైతులు ఆందోళనలకు దిగారు. కొన్నేండ్లుగా నిమ్జ్, రెవెన్యూ అధికారులు తమను ముప్పుతిప్పలు పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సారవంతమైన భూములను నిమ్జ్ ప్రాజెక్టు సేకరణ నుంచి తొలిగించాలని, తమ భూములు మార్కెట్లో అమ్ముకునేందుకు అవకాశాలు కల్పించాలని, బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. గ్రామ సభలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జహీరాబాద్ డీఎస్పీ రామ్మోహ్మన్రెడ్డి ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామసభలో తహసీల్దార్ భూ పాల్, డిప్యూటీ తహసీల్దార్లు రాజిరెడ్డి, సతీశ్, ఆర్ఐ సిద్ధరెడ్డి, జహీరాబాద్ పట్టణ, రూరల్ సీఐలు శివలింగం, జక్కుల హనుమంతు, ఎస్ఐలు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.