సంగారెడ్డి, జనవరి 27(నమస్తే తెలంగాణ): ఏడాదికి రూ.15వేల రైతుభరోసా ఇస్తామని చెప్పిన రేవంత్ సర్కార్ మాట తప్పింది. సంగారెడ్డి జిల్లాలోని రైతులందరికీ ఏకకాలంలో రైతుబంధు డబ్బులు జమ చేయకుండా ఎంపిక చేసిన గ్రామాల రైతులకు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసా అందజేస్తుంది. జిల్లాలో మొత్తం 647 గ్రామాలు ఉండగా వీటిలో మండలానికి ఒకటి చొప్పున ఎంపిక చేసిన 25 గ్రామాల్లోని రైతులకు మాత్రమే ప్రభుత్వం రైతుభరోసా ప్రారంభించింది. ఆదివారం బ్యాంకులకు సెలవుకావడంతో సోమవారం నుంచి 25 గ్రామాల్లోని రైతుల ఖాతాల్లో ఎకరాకు రూ.6వేల చొప్పున రైతుభరోసా డబ్బులు జమ కావటం ప్రారంభమైంది.
25 గ్రామాల్లోని 19,933 మంది రైతులకు ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు విడుదల చేసింది. ఎంపిక చేసిన 25 గ్రామాల్లోని అందరి రైతుల ఖాతాల్లో డబ్బులు జమకాలేదు. ఎకరంలోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యాయి. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై రైతుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఎంపిక చేసిన గ్రామాల్లో సైతం రైతులందరికీ ఏకకాలంలో రైతుభరోసా డబ్బులు జమకాకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. కేసీఆర్ పాలనలో జిల్లాలోని రైతులందరికీ ఏకకాలంలో రైతుబంధు డబ్బులు ఖాతాల్లో జమయ్యేవని, కేసీఆర్ రైతుల పక్షపాతని రైతాంగం గుర్తు చేసుకుంటున్నారు.
రైతుభరోసాపై రేవంత్ సర్కార్ మాట తప్పిందని రైతులు మండిపడుతున్నారు. ఏడాదికి రూ.15వేల రైతుభరోసా ఇస్తామని ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక రైతుభరోసాపై మాట తప్పారు. వానకాలంలో రైతుభరోసా డబ్బులు విడుదల చేయలేదు. దీనికితోడు రైతుభరోసా అమలుకు రేవంత్‌రెడ్డి సర్కార్ పలు ఆంక్షలు విధించే ప్రయత్నం చేస్తుంది. సాగుకు యోగ్యమైన భూమికే రైతుభరోసా ఇస్తామని, 10 ఎకరాల్లోపు ఉన్న రైతులకు రైతుబంధు ఇస్తామని కాంగ్రెస్ సర్కార్ రైతుభరోసాపై లీకులు ఇస్తుంది. దానికి తగ్గట్టుగానే ఇటీవల సంగారెడ్డి జిల్లాలో సాగుకు యోగ్యంకానీ భూములను అధికారులు గుర్తించారు.
సంగారెడ్డి జిల్లాలో 6వేల ఎకరాలకు పైగా సాగుకు యోగ్యం కానీ భూమిని గుర్తించారు. జనవరి 26 నుంచి ఎంపిక చేసిన గ్రామాల్లో ఏడాదికి రూ.12వేల చొప్పున రైతుభరోసా అమలు చేస్తామని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. జిల్లాలో ఎంపిక చేసిన 25 గ్రామాల్లో అందరి రైతుల ఖాతాల్లో రైతుభరోసా డబ్బులు జమకాలేదు. 25 గ్రామాల్లోని 19,933 మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమకావాల్సి ఉండగా సోమవారం ఎకరంలోపు విస్తీర్ణం ఉన్న రైతుల ఖాతాల్లో మాత్రమే డబ్బులు జమయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 647 గ్రామాలు ఉండగా ప్రభుత్వం కేవలం 25 గ్రామాల్లోని రైతులకు మాత్రమే రైతుభరోసా డబ్బులు విడుదల చేసింది. మిగితా 622 గ్రామాల్లోని రైతులకు రైతు భరోసా వర్తింపుపై స్పష్టత లేదు. దీంతో ప్రభుత్వం తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా రైతాంగం కేసీఆర్, రైతుబంధు పథకాన్ని గుర్తు చేసుకుంటున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా కేసీఆర్ తన పాలనలో ప్రతిరైతుకూ ఎకరాకు ఏడాదికి రూ.10వేల పెట్టుబడి సాయం అందజేశారు. రైతుబంధు పథకం కింద వానకాలం, యాసంగి సీజన్లలో జిల్లాలోని రైతులందరికీ ఖాతాల్లో ఏకకాలంలో కేసీఆర్ సర్కార్ జమ చేసింది. 2018లో రైతుబంధు పథకం ప్రారంభమైంది. సంగారెడ్డి జిల్లాలో 2023 వరకు 3.24 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.3272 కోట్ల పెట్టుబడి సాయాన్ని కేసీఆర్ ప్రభుత్వం జమ చేసింది. కేసీఆర్ ఏకకాలంలో రైతుబంధు డబ్బులు జమ చేసేవారని, ఇప్పుడు రేవంత్‌రెడ్డి సర్కార్ రైతు భరోసా పేరుతో మోసం చేస్తున్నదని రైతులు మండిపడుతున్నారు.
చిన్నశంకరంపేట, జనవరి 27: రాత్రి 12గంటలు ఏమో కానీ, పగలు 12గంటలు దాటినా ఫోన్లు మోగలే.. రైతు భరోసా డబ్బులు రాలేదు. సోమవారం మధ్యాహ్నం 12గంటల దాటినా రైతుల అకౌంట్లలో డబ్బులు పడకపోయేసరికి అన్నదాతలు నిరుత్సాహానికి గురయ్యారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి రైతుల అకౌంట్లలో రైతు భరోసా డబ్బులు ఎకరాకు రూ.6000 చొప్పున పడతాయని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో రైతులు ఉదయం నుంచి ఫోన్లు పట్టుకొని రైతు భరోసా డబ్బులు కోసం ఎదురుచూశారు. కొంతమంది రైతులు బ్యాంకుల వద్దకెళ్లి అకౌంట్లు చెక్ చేసుకున్నారు.
డబ్బులు పడలేదని బ్యాంకు అధికారులు తెలుపడంతో నిరుత్సాహంతో వెనుతిరిగారు. గతంలో కేసీఆర్ సార్ నాట్ల ముందు రైతుబంధు డబ్బులు వేసేవారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ వర్షాకాలం ఎగ్గొట్టింది. యాసంగి నాట్లు పూర్తయినా ఇప్పటి వరకు రైతు భరోసా డబ్బులు వేయలేదని మండలంలోని వివిధ గ్రామాల రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆగం చేస్తుందన్నారు. రైతు భరోసా డబ్బులు వస్తాయని ఆశతో రైతులు గంట గంటకు ఫోన్లను చెక్ చేసుకున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకు కూడా రైతు భరోసా డబ్బులు అకౌంట్లో పడకపోవడంతో నిరుత్సాహానికి గురయ్యారు.
గుమ్మడిదల, జనవరి 27: నాకు రెండెకరాల 20 గుంటల భూమి ఉంది. సీఎం రేవం త్‌రెడ్డి నాలుగు నెలల నుంచి ఊరించి. రైతు బంధును, రైతు భరోసాగా మార్చి ఇదిగో వేస్తాను… అదిగో వేస్తాను…అని నిన్నటి వరకు డెడ్‌లైన్ పెట్టి ఆదివారం అర్ధరాత్రి నుంచి టకీటకీమని పడతాయన్నాడు.. అప్పటినుంచి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను. కానీ టకీటకీ లేదు.. టింగు టింగు లేదు.. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫోన్ పట్టుకొని పిచ్చోడిలాగా చూస్తూ కూర్చున్నా. ఫేస్బుక్ చూశాను.. మార్చి 31వరకు అంట… ఇలా మాట చెప్పిన 20 నిమిషాల్లోనే మాట మీద మాట మార్చేసిన సీఎం ప్రపంచంలోనే ఎవరూ లేరు అనుకుంటా…
– రామప్ప, రైతు, కొత్తపల్లి, గుమ్మడిదల మండలం