ఉమ్మడి మెదక్ జిల్లాలో యాసంగి సాగు పనులు ఊపందుకున్నాయి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసా ఇవ్వక పోవడంతో పంటల సాగుకు అవసరమయ్యే పెట్టుబడుల కోసం రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పడం లేదు. వారం పది రోజులుగా వరినాట్లు వేసే పనిలో రైతులు బిజీగా మారారు. ఈ సమయంలో రైతులకు ఎరువుల కొరత సైతం వేధిస్తున్నది. ఎరువుల కోసం రైతులు వేకువజామునే ఫర్టిలైజర్ షాప్‌ల వద్దకు వెళ్లి క్యూలు కడుతున్నారు. గంటల పాటు నిరీక్షించినా యూరియా దొరకని పరిస్థితి జిల్లాలో ఉంది.కాంగ్రెస్ సర్కారు వ్యవసాయాన్ని ఆగం చేస్తున్నదని రైతులు విమర్శిస్తున్నారు.
సిద్దిపేట, జనవరి 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేట జిల్లాలో 5,63,005 ఎకరాల సాగు విస్తీర్ణం కాగా, 3,61,078 మంది రైతులు ఉన్నారు. మెదక్ జిల్లాలో 3,20,514 ఎకరాల సాగు విస్తీర్ణం ఉండగా.. 2,80,949 మంది రైతులు, సంగారెడ్డి జిల్లాలో 7,48,000 ఎకరాల సాగు విస్తీర్ణం.. 3,62,143 మంది రైతులు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో వరి, మొక్కజొన్న, జొన్న, సోయా. కూరగాయలు, తదితర పంటలు ఎక్కువగా సాగవుతాయి. బీఆర్ఎస్ హయాంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతుబంధు కింద 11 విడతల్లో రూ. 8771 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమచేసి, రైతులకు దన్నుగా నిలిచి వ్యవసాయాభివృద్ధికి కృషిచేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు పూర్తయి మూడో ఏడాది నడుస్తున్నది.
ఇప్పటి వరకు కేవలం రెండు పంటలకే మాత్రమే రైతుభరోసా ఇచ్చింది. ఇందులో ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధం చేసిన డబ్బులు రైతుల ఖాతాలో జమచేసింది. తాము అధికారంలోకి వస్తే ఎకరాకు రూ. 15 వేలు చొప్పున ఏటా రెండు పంటలకు రైతుభరోసా ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. తీరా అధికారంలోకి వచ్చాక ఎకరాకు రూ. 6 వేల చొప్పున రెండు పంటలకు రూ. 12 వేలు మాత్రమే ఒకసారి వేసింది. 2024-25 యాసంగి సీజన్లో ఆలస్యంగా రైతుభరోసా వేసింది. దానికి అనేక కొర్రీలు పెట్టి కోతలు వేసింది. పూర్తిస్థాయిలో రైతులకు పడలేదు. మొన్నటి వానకాలంలో సైతం రైతుభరోసా అందరు రైతులకు అందలేదు. సాగు విస్తీర్ణాన్ని లెక్కకట్టి శాటిలైట్ ద్వారా సర్వే చేసి రైతుభరోసా వేస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రకటించారు. సాగుతో సంబంధం లేకుండా సాగుకు యోగ్యమైన ప్రతి గుంటకూ రైతుభరోసా వేయాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో రైతులకు యూరియా కొరతతో తిప్పలు తప్పడం లేదు. అధికారుల లెక్కలకు క్షేత్రస్థాయిలో ఉన్న లెక్కలకు పొంతన లేపి పరిస్థితి ఉంది. బస్తా యూరియా కావాలన్నా ఫర్టిలైజర్ దుకాణాల ముందు రైతులు పడిగాపులు కాయాల్సి వస్తున్నది. మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో యూరియా కోసం రైతులు రాత్రి సమయంలోనే ఎరువుల దుకాణాల ముందు క్యూలు కట్టారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఇలా ప్రతి రోజు ఎరువుల దుకాణాల ముందు రైతులు పడిగాపులు కాస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అధికార యంత్రాంగం మాత్రం యూరియా పుష్కలంగా ఉందని లెక్కలు చెబుతున్నారు. యూరియా బ్లాక్‌కు తరలుతుందన్న అనుమానాలు జిల్లాలో బలంగా వినపడుతున్నాయి. జిల్లాకు కేటాయించిన యూరియా పంపిణీ సక్రమంగా జరిగేందుకు కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించారు. ప్రత్యేకంగా నోడల్ అధికారులను సైతం నియమించారు. ఇంత చేసినా యూరియా కోసం రైతులు బారులు తీరిన దృశ్యాలు మాత్రం కనిపిస్తున్నాయి.
రైతుబంధు పథకం ప్రారంభించి నాటి నుంచి 2023 వానకాలం వరకు (11వ విడతల్లో) సిద్దిపేట జిల్లాలో 29,33,494 మంది రైతులకు రూ. 3,124.82 కోట్లు, మెదక్ జిల్లాలో 24,69,637 రైతులకు రూ.2,027.37 కోట్లు, సంగారెడ్డి జిల్లాలో 31,95,960 మంది రైతులకు రూ.3,619.54 కోట్లు, మొత్తం ఉమ్మడి జిల్లాలో 85,99,091 మంది రైతులకు రూ. 8,771.73 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాలో జమచేసింది.