మిరుదొడ్డి, ఏప్రిల్ 20: మొక్కజొన్న, పొద్దు తిరుగుడు పంటలను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోమవారం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మార్కెట్ కమిటీ (ఏఎంసీ) కార్యాలయం ఎదుట రైతులు బైఠాయించి సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి ధర్నా చేశారు. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న మిరుదొడ్డి పోలీసులు ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకునే విధంగా చూస్తామని రైతులను సముదాయించారు.
దీంతో రైతులు ధర్నా విరమించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల రైతులు మాట్లాడుతూ మొక్కజొన్న, పొద్దు తిరుగుడు ధాన్యాన్ని మిరుదొడ్డి మార్కెట్ కమిటీకు తీసుకొచ్చి 15 రోజులు గడుస్తున్నా అధికారులు కాంటా వేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఉన్న సమయంలో ఏ ధాన్యమైనా రైతుల నుంచి వెంటనే కొనుగోలు చేశారని గుర్తు చేశారు. సీఎం రేవంత్రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అన్ని విధాలుగా గోస తప్పడం లేదన్నారు. ఆందోళనలో ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.